ఎన్నాళ్ల‌కు మంద‌కృష్ణ వెలిగిపోయాడో!

Update: 2018-06-11 06:27 GMT
ద‌ళితుల హ‌క్కుల కోసం పోరాడే యోధుడిగా ఎమ్మార్పీఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు మంద‌కృష్ణ మాదిగ‌కున్న ఇమేజ్ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాల్సిన అవ‌స‌రం లేదు. ఒక‌ద‌శ‌లో బ‌ల‌మైన ముఖ్య‌మంత్రుల‌ను సైతం త‌న మాట‌ల‌తో ఉరుకులు ప‌రుగులు పెట్టించిన ఘ‌న‌త మంద‌కృష్ణ‌కు చెందుతుంద‌ని చెప్పాలి. అయితే.. గ‌డిచిన కొంత‌కాలంగా ఆయ‌న ఏం చేయాల‌న్నా ఏదో ఒక‌టి అడ్డుప‌డుతున్న ప‌రిస్థితి.

ఇక‌.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిపై ఆయ‌న చేసిన పోరాటం ఫోక‌స్ కావ‌టం త‌ర్వాత ఆయ‌న్ను రెండుసార్లు జైలుకు వెళ్లేలా చేసింది. ఇప్ప‌టివ‌ర‌కూ హెచ్చ‌రిక స్వ‌రంతో మాట్లాడే మంద‌కృష్ణ సైతం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి విష‌యంలో ఆచితూచి మాట్లాడాల‌న్న వ‌ర‌కూ త‌గ్గిన వైనం స‌ర్వ‌త్రా హాట్ టాపిక్ గా మారింది.

మంద‌కృష్ణ ప‌ని అయిపోయింద‌ని.. ఆయ‌న ప‌ట్టు జారిపోయిన‌ట్లేన‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తున్న వేళ‌.. వ‌రంగ‌ల్ లో తాజాగా ఆయ‌న నిర్వ‌హించిన ద‌ళిత‌.. గిరిజ‌న సింహ గ‌ర్జ‌న కార్య‌క్ర‌మం ఆయ‌న్ను మ‌రోసారి వెలిగిపోయేలా చేయ‌ట‌మేఏ కాదు.. మంద‌కృష్ణ బ‌లం త‌గ్గ‌లేద‌న్న విష‌యాన్ని మ‌రోసారి నిరూపించింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

జాతీయ స్థాయికి చెందిన నేత‌ల్ని తీసుకురావ‌టంతో పాటు.. ద‌ళితుల హ‌క్కుల కోసం పోరాడే విష‌యంలో త‌న త‌ర్వాతే ఎవ‌రైనా అన్న విష‌యాన్ని ఆయ‌న త‌న గ‌ర్జ‌న ద్వారా స్ప‌ష్టం చేశార‌ని చెప్పాలి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ద‌ళిత గ‌రిజ‌నుల రిజ‌ర్వేష‌న్లను త‌గ్గించి.. రాజ్యాంగ‌ప‌ర‌మైన హ‌క్కుల్ని కాల‌రాసే కుట్ర చేస్తున్న కేంద్రంపైన విరుచుకుప‌డిన మంద‌కృష్ణ‌.. ఎక్క‌డా కూడా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం మీద కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి మీద సూటిగా విమ‌ర్శ‌లు చేయ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ‌టం క‌నిపించింది.

గ‌ర్జ‌న సంద‌ర్భంగా ఆయ‌న చేసిన ప్ర‌సంగాన్ని చూస్తే.. ఎస్సీ.. ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పై సుప్రీం ఇచ్చిన తీర్పు హ‌క్కులు హ‌రించేలా ఉంద‌ని కేంద్రాన్ని త‌ప్పు ప‌ట్టిన ఆయ‌న‌.. ద‌ళిత గిరిజ‌నులు మొత్తం ఏక‌మై స్వ‌తంత్ర ఓటుబ్యాంక్‌ను కాపాడుకుంటేనే రాజ్యాంగ‌ప‌రంగా రావాల్సిన హ‌క్కులు ర‌క్షించుకుంటామ‌న్న మాట‌ను చెప్పారు.

రాజ‌కీయాల‌కు అతీతంగా వివిధ పార్టీల‌కు చెందిన జాతీయ స్థాయి నేత‌లు మంద‌కృష్ణ సింహ‌గ‌ర్జ‌న‌కు హాజ‌రై మ‌ద్ద‌తు ప‌ల‌క‌టంపై హ‌ర్షం వ్య‌క్తం చేసిన మంద‌కృష్ణ‌.. కేసీఆర్‌.. చంద్ర‌బాబుల‌ను గుర్తుకు తెచ్చేలా ప‌రోక్ష వ్యాఖ్య ఒక‌టి చేశారు. కేవ‌లం 5 శాతం ఓటుబ్యాంకు లేని సామాజిక వ‌ర్గాలు ముఖ్య‌మంత్రి పీఠం ఎక్కుతున్నార‌ని.. మ‌రి 30 శాతం జ‌నాభా ఉన్న ఎస్సీ.. ఎస్టీలు ఉడిగం చేసే ప‌రిస్థితి ఎందుకు ఉందంటూ వాపోయారు.ఎస్సీ..ఎస్టీ అత్యాచార నిరోధ‌క‌చ‌ట్టం అమ‌ల‌య్యే వ‌ర‌కూ విభేదాల్ని ప‌క్క‌న పెట్టి పోరాడాల్సిందేన‌ని పిలుపునిచ్చారు. కేంద్రంపైనా.. మోడీపైనా సంఘ‌టితంగా యుద్ధం చేద్దామ‌న్న మంద‌కృష్ణ మాట‌లు ఎలా ఉన్నా.. చాలా రోజుల త‌ర్వాత త‌న స‌త్తాను ప్ర‌ద‌ర్శించే విష‌యంలో మాత్రం ఆయ‌న స‌క్సెస్ అయ్యార‌ని చెప్పాలి.
Tags:    

Similar News