కరోనా: రెడ్ జోన్ గా మంగళగిరి

Update: 2020-04-02 08:45 GMT
నిన్న వరకూ ఏపీ ప్రశాంతం.. కానీ ఇప్పుడు కరోనా కల్లోలంతో కేసుల్లో తెలంగాణను మించిపోయింది. కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన వారితో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా సెంచరీ దాటేయడం కలకలం రేపుతోంది.

తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. 65 ఏళ్ల వ్యక్తికి వైద్య పరీక్షలు చేయగా.. పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు కమిషనర్ తెలిపారు. ఇతడు ఇటీవలే ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినట్టు గుర్తించారు.

ఇక 65 ఏళ్ల వ్యక్తితోపాటు అతడి ఐదుగురు కుటుంబ సభ్యులను క్వారంటైన్ కు తరలించారు.ఈ కేసు బయటపడడంతో మంగళగిరిలోని టిప్పర్ల బజార్ లో ఉన్న కరోనా బాధితుడి నివాసం నుంచి 3.కిమీల పరిధిని అధికారులు రెడ్ జోన్ గా ప్రకటించారు. సమీపంలోని దుకాణాలు - కూరగాయాల మార్కెట్లను మూసివేయించారు. 144 సెక్షన్ విధించారు. ఎవరినీ ఇంటి గడప దాటి బయటకు రానీయడం లేదు. ఆ ప్రాంతమంతా హైఅలెర్ట్ ప్రకటించారు.

నిన్న ఒక్కరోజే ఏపీలో ఏకంగా 67కొత్త కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. మొత్తం కేసుల సంఖ్య 111కు చేరింది. గుంటూరు జిల్లాలోనే అత్యధికంగా 20 కేసులు నమోదయ్యాయి.
Tags:    

Similar News