ఈసారికి హనుమంతన్నకు దెబ్బ పడనుందా?

Update: 2020-12-27 05:45 GMT
ఆశకు ఒక లెక్క ఉండాలి. తమను తాము మొనగాళ్లుగా అనుకునే నేతలు.. నాయకులుగా తమకు ఎక్స్ పెయిరీ డేట్ వచ్చేసి చాలాకాలమే అయ్యిందన్న విషయాన్ని మర్చిపోతుంటారు. కీలక పదవులు చేపట్టాలని తపిస్తుంటారు. ఈ కోవలోకే వస్తారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు. జనాదరణ సంగతిని ఆయన పట్టించుకోరు. మీద పడిన వయసును లెక్క చేయకుండా.. కుర్రాళ్లతో పోటీ పడాలన్న తపన ఆయనలో ఉంది. కానీ.. తనకున్న పరిమితుల్ని ఆయన మర్చిపోవటం.. కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది.

పీసీసీ చీఫ్ పదవి కోసం పోటీ పడుతున్ననేతల జాబితాలో వీహెచ్ ఒకరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు ఆ పదవి.. తనకున్న సామర్థ్యంతో పోలిస్తే.. అత్యాశే అవుతుంది. ఆ విషయాన్ని ఆయన పట్టించుకోరు. అంతేకాదు.. ఆ పదవి కోసం పోటీ పడుతున్న వారిపైనా తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంటారు. పనిలో పనిగా అధిష్ఠానం దూతలపైనా ఆయన చేసే ఆరోపణలు.. పార్టీ పరువుతును బజార్లో పెట్టేలా ఉంటాయి.

తాజాగా పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ఎపిసోడ్ లో ప్యాకేజీలు మాట్లాడుకుంటున్నట్లుగా ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు దుమారంగా మారాయి. నిత్యం మీడియా సమావేశాలు పెట్టిన వైనం ఇప్పుడు పార్టీకి తలనొప్పిగా మారినట్లు చెబుతున్నారు. గతంలో వీహెచ్ మాటల్ని సీరియస్ గా పట్టించుకోని అధినాయకత్వం.. తాజాగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకేడదన్న భావనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే వీహెచ్ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో క్లిప్పులు.. పేపర్ కటింగ్ లను అనువాదం చేసి పార్టీ పెద్దలకు పంపినట్లుగా తెలుస్తోంది.

వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ప్రతిఒక్కరిపైనా నోరు పారేసుకోవటం ఏ మాత్రం సరికాదని.. దీని కారణంగా పార్టీ ఇమేజ్ కు నష్టం వాటిల్లుతున్నట్లుగా పేర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్ర పార్టీకి ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్న మాణిక్యం ఠాగూర్ సైతం వీహెచ్ వైఖరిపై గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీకి మేలు చేసే వ్యాఖ్యల కన్నా.. డ్యామేజ్ చేసేవే ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో మాదిరి చూసిచూడనట్లుగా వ్యవహరించకుండా.. నిబంధనల కొరడాను ప్రయోగించే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే.. వీహెచ్ నోటికే కాదు.. ఆ తరహాలో వెళ్లానుకునే వారందరి నోటికి తాళం పడుతుందంటున్నారు.
Tags:    

Similar News