అడ్డంగా బుక్క‌య్యారుగా.. లిక్క‌ర్ స్కాంలో 'కోటి' లంచం

Update: 2022-08-20 02:30 GMT
ఢిల్లీ ఉపముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత మనీశ్ సిసోడియా అడ్డంగా బుక్క‌యిపోయారు. త‌న అనుచ‌రుడి ద్వారా సిసోడియా రూ.కోటి లంచం తీసుకున్న‌ట్టు.. లిక్క‌ర్‌ స్కామ్‌లో సీబీఐ ఎఫ్‌ఐఆర్ న‌మోదు చేసింది. దీనిలో ఆయన్ను ఏ1గా చేర్చింది. 120-బీ, 477-ఏ సెక్షన్ల ప్రకారం ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌‌లో చేర్చారు.

సిసోడియా సహా మొత్తం 15 మంది పేర్లు ఈ ఎఫ్‌ఐఆర్‌‌లో ఉన్నాయి. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌‌లో నాటి ఎక్సైజ్ కమిషనర్ అర్వా గోపి కృష్ణ పేరు కూడా ఉంది. ఢిల్లీ మద్యం విధానంపై దాఖలైన కేసులో భాగంగా సిసోడియా నివాసంతో పాటు 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంతోపాటు మొత్తం 21 చోట్ల సీబీఐ అధికారులు ఈరోజు దాడులు నిర్వహించారు.

మనీష్ నివాసాలు సహా పలువురు ప్రముఖుల సంస్థలు, ఇళ్లల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ కొన్ని గంటలపాటు విస్తృత సోదాలు నిర్వహించింది. మొత్తం 31 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. అనంతరం రూ.కోటి వ్యవహారంపై ప్రకటన జారీ చేసింది. మొత్తం 15 మందిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చిన సమయంలోడిల్లీ ఎక్సైజ్ కమిషనర్గా ఉన్న అరవ గోపీ కృష్ణ, అప్పటి డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ ఆనంద్ కుమార్ తివారీ, అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ పంకజ్ భట్నాగర్, తొమ్మిది మంది వ్యాపారవేత్తలు, రెండు కంపెనీలపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎక్సైజ్ పాలసీలో అవినీతి జరిగిందని సీబీఐ పేర్కొంది.

మరోవైపు డిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీలో అవినీతికి సంబంధించిన కేసులో డిప్యూటీ సీఎం మనీష్ ను ఈడీ కూడా విచారించనున్నట్లు సమాచారం. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్, దర్యాప్తు వివరాలను ఈడీ కేంద్ర కార్యాలయానికి పంపినట్లు తెలిసింది. త్వరలో ఈడీ కూడా ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు మొదలు పెట్టనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

అస‌లు ఏం జ‌రిగింది..?

గత ఏడాది నవంబర్‌లో కేజ్రీవాల్ సర్కారు ప్రవేశపెట్టిన నూతన అబ్కారీ విధానంలో అవకతవకలు,  విధానపరమైన లోపాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. టెండర్ల విధానంలో ఆయాచితంగా కొందరికి లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నారని ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన నివేదికలో ఉంది. దీంతో ఈ నివేదికపై దర్యాప్తు చేపట్టాలని ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐకి సిఫార్సు చేశారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్ శాఖకు ఇంఛార్జ్‌గా ఉన్న మనీశ్ సిసోడియా పాత్ర గురించి కూడా నివేదికలో ఉంది. దీంతో సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు.
Tags:    

Similar News