రెయిన్ కోట్ తో స్నానం చేసిన మ‌న్మోహ‌న్‌

Update: 2017-02-08 16:10 GMT
మాజీ ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్ పై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఆశ్చ‌ర్య‌క‌ర కామెంట్లు చేశారు. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగంపై ధ‌న్య‌వాద తీర్మానంలోభాగంగా ప్ర‌సంగిస్తూ.. నోట్ల ర‌ద్దుపై స‌మాధాన‌మిచ్చారు. ఈ చ‌ర్చ‌లో 70 మంది మాట్లాడార‌ని, వారికి కృత‌జ్ఞ‌త‌ల‌ని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. 35 ఏళ్లుగా భారత ఆర్థిక వ్యవస్థపై మన్మోహన్ ప్రభావం ఉందని, ఈ కాలంలో ఒక్క మచ్చ కూడా ఆయనపై లేదని మోడీ అన్నారు. అయితే బాత్ రూమ్ లోనూ రెయిన్ కోట్ వేసుకొని స్నానం చేసే కళ ఆయనకే తెలుసని ప్ర‌ధాన‌మంత్రి వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ స‌హా ప్రతిపక్షాలు మండిపడ్డాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై మోదీ చేసిన వ్యాఖ్యలు సభలో గందరగోళానికి దారితీయ‌డంతో తప్పు చేసినా చిక్కలేదన్న ఉద్దేశంలో తాను ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ వివ‌ర‌ణ ఇచ్చారు.

కాగా, నోట్ల ర‌ద్దు ప్ర‌పంచంలో గ‌తంలో ఎన్న‌డూ జ‌ర‌గ‌లేద‌ని, ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఆర్థిక వేత్త‌ల‌కు ఇదొక కేస్ స్ట‌డీగా ప‌నికొస్తుంద‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. అవినీతి, న‌ల్ల‌ధ‌నంపై పోరు రాజ‌కీయం కాద‌ని స్ప‌ష్టంచేశారు. 1971లో నోట్లు ర‌ద్దు చేయాల్సిందిగా అప్ప‌టి ఆర్థిక మంత్రి స‌ల‌హా ఇచ్చినా ఇందిరాగాంధీ ప‌ట్టించుకోలేద‌ని మాధ‌వ్ గాడ్‌బోలే త‌న బుక్‌లో రాసిన‌ట్లు మోడీ తెలిపారు. దీనిపై కాంగ్రెస్ నేత ఆనంద్ శ‌ర్మ మండిప‌డ‌టాన్ని ప్ర‌ధాని త‌ప్పుబ‌ట్టారు. ఆ బుక్ ప‌బ్లిష్ చేసిన‌పుడే ఎందుకు నిల‌దీయ‌లేద‌ని, అప్పుడు నిద్ర‌పోయారా అంటూ ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌శ్నించారు. నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో రాజ‌కీయ నేత‌లు, ప్ర‌జ‌ల ఆలోచ‌నా విధాన‌ల్లో స్ప‌ష్ట‌మైన భేదం క‌నిపించింద‌ని చెప్పారు. నోట్ల ర‌ద్దు నిర్ణ‌యాన్ని ప్ర‌జ‌లు స్వాగ‌తించార‌ని ప్ర‌ధాని తెలిపారు. దేశ ప్ర‌యోజ‌నం కోస‌మే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని, ఏ రాజ‌కీయ పార్టీని ఇబ్బంది పెట్టే ఉద్దేశం త‌మ‌కు లేద‌ని స్ప‌ష్టంచేశారు.  పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సరైన సమయంలోనే తీసుకుని అమలుపరిచామని, సత్ఫలితాలు సాధించామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో వలె కాకుండా బినామీ చట్టాన్ని మరింత పకడ్బంధీగా మార్చి మేలైన ఫలితాలు రాబట్టే దిశగా వెళ్తున్నామని చెప్పారు.

దేశంలో అక్రమధనాన్ని అరికట్టేందుకు ఆరు దశాబ్దాలకుపైగా ప్రభుత్వాలు ఏమీ చేయలేదని, తన ప్రభుత్వం సిట్ ఏర్పాటు, బినామీ చట్టాన్ని మరింత దృఢపరుచడం, రియల్ ఎస్టేట్ బిల్లు, రూ.2లక్షల లావాదేవీలకు పాన్‌కార్డు తప్పనిసరి చేయడం తదితర చర్యలను తీసుకుందని ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు. లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణ అంశాన్నీ ఆయన ప్రస్తావించారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు దీనిని పరిశీలించాలని కోరారు. అక్రమధనంపై, బినామీ ఆస్తులపై ప్రతిపక్ష కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై ప్రధాని మోడీ ప్రతిస్పందించారు. బినామీ చట్టాన్ని తామే సమర్థంగా అమలుచేయాలని సంకల్పించినట్లు చెప్పారు. "అక్రమధనం భారీమొత్తంలో నగదుగా కాకుండా నగలు, రియల్ ఎస్టేట్, బినామీ ఆస్తుల రూపంలో ఉంటుందని ప్రతిపక్ష కాంగ్రెస్ నేత ఖర్గేజీ అంటున్నారు. నేను మీతో ఏకీభవిస్తున్నాను. కానీ.. ఇదెప్పటి వాస్తవమో గుర్తించండి. బినామీ ఆస్తుల నిరోధక చట్టాన్ని రాజీవ్‌గాంధీ ప్రభుత్వానికి భారీ మెజారిటీ ఉన్న 1988లో తెచ్చారు. కానీ దానిని నోటిఫై చేయనేలేదు. 26 ఏళ్ల‌ పాటు అలాగే ఉండటానికి కారణమేమిటి?.. ఇది ఇప్పటి విషయమేమీ కాదు. నాడు యశ్వంత్‌రావు చవాన్ అక్రమధనాన్ని నిర్మూలించే ప్రతిపాదనతో నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దగ్గరకు వెళితే.. మీరు ఎన్నికల్లో పోటీచేయరా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎన్నికల కోసం భయపడుతుంది. కానీ మేము అలా కాదు. మేము దేశం కోసం బాధపడతాం. అందుకే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నాం" అని ప్రధాని అన్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News