పారికర్ పాత కుర్చీలోకే..?

Update: 2016-08-07 08:22 GMT
గుజరాత్ లో ఆనందిబెన్ రాజీనామా.. కొత్త ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ ఎన్నిక తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ తన రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులను మార్చే పనిపెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. గుజరాత్ తరువాత ఛత్తీస్ గఢ్ - మధ్యప్రదేశ్ - గోవా ముఖ్యమంత్రులనూ మారుస్తారని తెలుస్తోంది.  ముఖ్యంగా ఛత్తీస్ గఢ్ - గోవాల్లో ముఖ్యమంత్రుల మార్పు తప్పదని వినిపిస్తోంది. ఛత్తీస్ గఢ్ లో మూడు పర్యాయాలుగా సీఎంగా ఉన్న రమణ్ సింగ్ స్థానంలో ఎవరిని నియమిస్తారన్నది తెలియకపోయినా గోవాలో మాత్రం కొత్త సీఎం ఎవరన్న విషయంలో క్లారిటీ ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రక్షణ మంత్రి మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రిగా వెళ్లనున్నారని అంటున్నారు.

గుజరాత్‌లో పరిస్థితులు చక్కబడడంతో ఇప్పుడు అధిష్ఠానం గోవాపై దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. గుజరాత్‌ లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రకంపనలతో ముఖ్యమంత్రిని మార్చేసిన బీజేపీకి గోవాలోనూ అదే పార్టీ కొరకరాని కొయ్యగా మారినట్టు తెలుస్తోంది. దీంతో సీఎం మార్పే అందుకు పరిష్కారంగా అధిష్ఠానం తేల్చినట్టు సమాచారం. రాజకీయ విశ్లేషకుల అంచనాలు నిజమైతే త్వరలో గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ తన పదవికి రాజీనామా సమర్పిస్తారు. ఆ స్థానంలో రక్షణ మంత్రి మనోహర్ పారికర్ బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బీజేపీ రాష్ట్రంలో తీవ్ర కష్టాల్లో ఉన్నట్టు భావించాల్సి వస్తోందని విశ్లేషకులు అంటున్నారు. గోవా ప్రభుత్వం పనితీరుపై దృష్టి సారించిన ప్రధాని మోదీ ప్రభుత్వం నుంచి నివేదిక కోరినట్టు తెలిసింది.

దీనికి తోడు గోవాలో బీజేపీ, ఆరెస్సెస్ మధ్య విభేదాలు కూడా సీఎం మార్పును అనివార్యం చేసినట్టు సమాచారం. ప్రస్తుత సీఎం లక్ష్మీకాంత్ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండడం, ఆప్ ను సమర్థంగా ఎదుర్కోలేకపోవడం వంటివి అధిష్ఠానానికి ఆగ్రహం తెప్పించాయని తెలుస్తోంది. దీంతో ఇంతకుముందు సీఎంగా ఉండి ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న పారికర్ నే మళ్లీ గోవా పీఠంపై కూర్చోబెడతారని తెలుస్తోంది.
Tags:    

Similar News