మోడీ నోట ఆ మాట బాంబు పడినట్లైందట

Update: 2016-07-06 08:59 GMT
ఎవరికైనా కీకల పదవి ఇస్తానంటే ఎగిరి గంతేస్తారు. కానీ.. రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తీరు అందుకు పూర్తి భిన్నం. పిలిచి మరీ.. పెద్ద పదవి ఇస్తానంటే వద్దంటే వద్దని అనుకోవటమే కాదు.. ఢిల్లీ వెళితే మళ్లీ అడుగుతారన్న ఉద్దేశంతో దేశ రాజధాని వైపే చూడకూడదనుకున్నారట. ఈ విషయాల్ని ఎవరో చెప్పటం కాదు.. ఆయనే స్వయంగా వెల్లడించారు. తాజాగా గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ 60వ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన కేంద్ర రక్షణ మంత్రి.. గోవా మాజీ ముఖ్యమంత్రి పారికర్ చెప్పుకొచ్చారు.

మోడీ తనకు రక్షణ మంత్రి పదవి ఆఫర్ చేయటం.. ఆ టైంలో తాను ఏమనుకున్నానన్న ఆసక్తికర విషయాల్ని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. 2014 అక్టోబర్ 26న తాను గోవా రాష్ట్ర సమస్యల్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లేందుకు ఢిల్లీ వెళ్లానని.. ఆయన్ను కలిసి గోవా మైనింగ్ ఇష్యూను ప్రస్తావించి.. రాష్ట్రానికి ఆర్థిక సాయాన్ని కోరానని చెప్పారు.

అప్పుడు మోడీ రియాక్ట్ అవుతూ తనను కేంద్ర క్యాబినెట్ లో బాధ్యతను చేపట్టాల్సిందిగా కోరారు. ‘‘అసలు మీరెందుకు కేంద్ర క్యాబినెట్ లో చేరకూడదు? ఆయన నోట ఆ మాట విన్న వెంటనే నెత్తి మీద ఏదో పెద్ద బాంబు వేసినట్లుగా ఫీలయ్యా. మంత్రి పదవి అంటే నా మీద బాంబు వేయటం లాంటిదే. అందుకే.. ఆలోచించి చెబుతానని మోడీ దగ్గర నుంచి జారుకున్నా. మళ్లీ ఢిల్లీకి వచ్చి ప్రధానిని కలిస్తే.. ఈ విషయం మళ్లీ ప్రస్తావనకు వస్తుందని భావించా. అందుకే.. ఢిల్లీకి మరో మూడు.. నాలుగు నెలల వరకూ వెళ్లకూడదని నిర్ణయించుకున్నా. కానీ.. ఐదారు రోజుల్లోనే ప్రధాని మోడీ నాకు మళ్లీ ఈ విషయాన్ని గుర్తు చేశారు. చివరకు కేంద్రానికి వెళ్లాలని నవంబరు 6న నిర్ణయించుకున్నా’’ అని చెప్పారు.

అలా నిర్ణయించుకున్న రెండు రోజులకే గోవా ముఖ్యమంత్రి పదవికి పారికర్ రాజీనామా చేశారు. ఆయన ఢిల్లీకి వెళ్లటం కేంద్రరక్షణమంత్రిగా బాధ్యతలు స్వీకరించటం తెలిసిందే. ఆయన స్థానంలో ప్రస్తుత గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ బాధ్యతలు స్వీకరించారు.
Tags:    

Similar News