ఓట్ల‌తో గెలిచాడు.. ఒద్దిక‌తో మ‌న‌సు దోచేశాడు!

Update: 2019-05-26 08:10 GMT
ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన వారిలో ఎవ‌రో ఒక‌రిదే విజ‌యం. ఓట్ల వేట‌లో ఒక‌రు విజేత‌గా నిలిస్తే.. మిగిలినోళ్లంతా ప‌రాజితుల జాబితాలో ఉంటారు. ఎన్నిక‌ల సంద‌ర్భంగా మొద‌ల‌య్యే వైరం అంత‌కంత‌కూ పెరుగుతూనే ఉంటుంది. ఎన్నిక‌ల్లో ఒక‌రిపైన పోటీ చేసి.. వారి మీద గెలిచిన వెంట‌నే వారింటికి వెళ్లి.. ఆశీర్వాదం కోర‌టం సాధ్య‌మేనా? అంటే నో అని చెబుతారు. కానీ.. ఆ ప‌ని చేసి వార్త‌ల్లోకి వ‌చ్చారు ఢిల్లీ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు మ‌నోజ్ తివారీ.

తాజాగా ముగిసిన ఎన్నిక‌ల్లో ఆయ‌న కాంగ్రెస్ అభ్య‌ర్థి మాజీ ముఖ్య‌మంత్రి షీలా దీక్షిత్ పై సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు 7,87,799 ఓట్లు రాగా.. షీలా దీక్షిత్ కు 4,21,697 ఓట్లు పోల‌య్యాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్య‌ర్థి దిలీప్ పాండేకు 1,90,856 ఓట్లు వ‌చ్చాయి. దీంతో.. మ‌నోజ్ తివారీ 3.6 ల‌క్ష‌ల ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించారు.

తాను సాధించిన విజ‌యానికి విర్ర‌వీగని ఆయ‌న వెంట‌నే.. త‌న ప్ర‌త్య‌ర్థి.. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత షీలాదీక్షిత్ ఇంటికి వెళ్లారు. ఆమె ఆశీర్వాదాన్ని కోరారు.  ఆమెనుక‌లిసిన సంద‌ర్భంగా కుశ‌ల ప్ర‌శ్న‌ల‌తో పాటు.. ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీశారు. మూడుసార్లు ఢిల్లీ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన షీలా ఓట‌మిని త‌న గొప్ప‌త‌నంగా కాకుండా.. ఆమెకు ఇవ్వాల్సిన మ‌ర్యాదను ఇచ్చేసిన తీరు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించ‌ట‌మే కాదు.. ఆయ‌న ఒద్దిక ప‌లువురి మ‌న‌సుల్ని దోచేలా చేసింది.
Tags:    

Similar News