జనసేన టికెట్ కోసం గంటా చుట్టం పాగా...?

Update: 2023-01-16 04:31 GMT
ఉమ్మడి విశాఖ జిల్లాలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు హవా మామూలుగా ఉండేది కాదు. ఆయన మంత్రిగా ఉన్నా ఎంపీగా ఉన్నా ఆయన అనుచరులు బలమైన వారు ఎపుడూ వెంట ఉంటూండేవారు. ఇక గంటా చుట్టంగా పేరు పొందిన పరుచూరి భాస్కరరావు ఆయన ఎక్కడ నుంచి పోటీ చేసి గెలిస్తే అక్కడ ఉంటూ మొత్తం వ్యవహారాలను చక్కబెట్టేవారు.

ఒక విధంగా డీ ఫ్యాక్టో ఎమ్మెల్యేగా మంత్రిగా ఆయన వ్యవహరించేవారు అని చెబుతారు. క్రిష్ణా జిల్లాకు చెందిన ఆయన విశాఖలో గంటాతో పాటే సెటిల్ అయిపోయారు. అయితే 2019 ఎన్నికల ముందే ఇద్దరికీ విభేదాలు వచ్చి విడిపోయారని అంటారు. అలా ఆయన ముందు కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ జై సమైక్యాంధ్రాలో చేరారు. ఆ తరువాత జనసేనలో చేరిపోయారు. ఆయన అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్ధిగా నాడు పోటీ చేశారు, ఓటమి పాలు అయ్యారు.

ఇపుడు చూస్తే 2024 ఎన్నికలు వస్తున్నాయి. మరో మారు పోటీ చేసి గెలవాలని చూస్తున్నారు. గతసారి కంటే ఈసారి విజయావకాశాలు తప్పనిసరిగా ఉంటాయని జనసేన నాయకులు భావిస్తున్నారు. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే కచ్చితంగా చాలా సీట్లు గెలుస్తామని భావిస్తున్నారు. అలా చూసుకుంటే అనకాపల్లిలో పరుచూరి భాస్కరరావు మరోమారు పోటీకి దిగుతారు అని అంటున్నారు.

ఆయన లేటెస్ట్ గా మంత్రి అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాధ్ కి సవాల్ చేశారు. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి నుంచి మంత్రి గారు పోటీ చేస్తే తాను జనసేన అభ్యర్ధిగా దిగి ఓడిస్తానని భీషణ ప్రతిన చేశారు. పవన్ మీద విమర్శలు చేయడం కాదు ముందు తనతో పోటీకి రెడీ కావాలని కూడా చాలెంజి విసిరారు.

ఇన్నాళ్ళూ పెద్దగా హడావుడి చేయని పరుచూరి భాస్కరరావు సడెన్ గా మీడియా ముందుకు వచ్చి ఈ విధంగా సవాల్ చేయడం చూసిన వారు ఆయనలో కొత్త ఆశలు మొదలయ్యాయని అంటున్నారు. తెలుగుదేశంతో పొత్తు అంటే గెలుపు అవకాశాలు పెరుగుతాయి కాబట్టే పరుచూరి రంగంలోకి దిగాలని చూస్తున్నారు అంటున్నారు. ఇదే సీటు మీద చాలా మంది జనసేన నాయకుల కన్ను ఉంది. మరి పొత్తులో భాగంగా తెలుగుదేశం ఈ సీటు ఇస్తుందా లేదా అన్నది చూడాలి.

ఇక నాన్ లోకల్ గా ఉన్న పరుచూరికి టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు ఎంతవరకూ ఉంటాయన్నది ఆలోచించాలని అంటున్నారు. ఆయన కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు, మరి అనకాపల్లిలో బీసీలు కాపులే ఎక్కువ. వారికి టికెట్ ఇస్తేనే గెలుస్తారు అన్నది చరిత్ర చెబుతున్న సత్యం. కానీ పరుచూరి డేరింగ్ గా తానే జనసేన అభ్యర్థి అని అంటున్నారు అంటే తనకున్న అంగబలం అర్ధబలం చూసుకునే అని అంటున్నారు.

ఇకపోతే వచ్చే ఎన్నికల్లో ఆచీ తూచీ టికెట్లను ఇవ్వాలనుకుంటున్న పవన్ కళ్యాణ్ సామాజిక సమీకరణలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు అని అంటున్నారు. దాంతోపాటు లోకల్స్ కే ప్రయారిటీ అని అంటున్నారు. మరి బిగ్ షాట్ గా ఉన్న పరుచూరిని కాదనే సీన్ ఉందా అన్నది కూడా ఒక ప్రశ్న. ఏది ఏమైనా గంటా ద్వారా రాజకీయం మొత్తం వంటబట్టించుకున పరుచూరి ఆయన అనకాపల్లిలో ఎమ్మెల్యేగా ఉన్నపుడు చక్రం తిప్పారు.

దాంతో అనకాపల్లిలో అణువణువూ తెలుసు కాబట్టి గెలుపు కోసం ఆయన అలుపు లేకుండా పోరాడుతారు అంటున్నారు. మరి పవన్ చేతిలోనే డెసిషన్ ఉంది. పరుచూరి కూడా పవన్ని విమర్శించారన్న కారణంతో గుడివాడ మీద కౌంటర్ అటాక్ చేస్తూ ఇండైరెక్ట్ గా తన మనసులోని మాటను అధినేతకు తెలివిగా చెప్పారని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News