ఆర్‌ కే అక్క‌డున్నాడ‌ట‌

Update: 2016-10-29 04:39 GMT
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆర్‌ కే జీవించి ఉన్నాడా? మరణించాడా? గాయాలతో తప్పించుకున్నాడా? ఇటువంటి అనేక ప్రశ్నలకు సమాధానం లేదు. పోలీసుల అదుపులో ఉన్నాడని ప్రజా సంఘాల నాయకులు - తమ వద్ద లేడని పోలీసు ఉన్నతాధికారులు చెపుతున్నారు. అయితే, ఆర్‌ కే మరణించాడంటూ మావోయిస్టు పార్టీ నాయకుడు ఒకరు ప్ర‌క‌టించ‌గా.. ఈ వార్త పోలీసు సృష్టి అని విప్ల‌వ సంఘాల నాయకులు అంటున్నారు. బెజ్జంగి ఎన్‌ కౌంటర్ జరిగినప్పుడు ఆర్‌కే అక్కడ లేడని కొంతమంది చెపుతుంటే, వ్యూహాత్మకంగా తప్పించుకున్నాడని ఇంకో కథనం వినిపిస్తోంది. ఆయన ఖాయంగా తప్పించుకుని సురక్షితంగా ఉన్నాడని ప్రజా సంఘాల నాయకులు చెపుతున్నారు.

ఆర్‌కే జీవించి ఉన్నాడ‌ని చెప్పేందుకు గ‌ల కార‌ణాల‌ను సద‌రు ప్ర‌జాసంఘాలు ఆస‌క్తిక‌రంగా వివ‌రిస్తున్నాయి. ఆర్‌ కే ఏదైనా సమావేశానికి హాజరైతే మూడంచెల భద్రత ఉంటుంది. అదే ఆయన అటవీ ప్రాంతాల్లో సంచరించినప్పుడు, ఒక దగ్గర నుంచి మరో దగ్గరకు వెళ్లినప్పుడు సాయుధ బలగాలు ఆయనను కంటికి రెప్పలా కాపాడుతుంటాయి. ముందు ఆరుగురు సాయుధ సిబ్బంది ర‌క్ష‌ణ‌గా సాగుతారు. ఆ తరువాత ఆర్‌ కే  ఉంటారు. ఆయన చుట్టూ నలుగురు - లేదా ఆరుగురు గన్‌ మెన్‌ లు ఉంటారు. ఆయన వెనుక కొంత దూరంలో సాయుధ సిబ్బంది రక్షణగా ఉంటారు. బెజ్జంగి ఎన్‌ కౌంటర్ నుంచి ఆ సాయుధ సిబ్బందే ఆర్‌ కేను సురక్షితంగా తప్పించారని వారు భావిస్తున్నారు. చత్తీస్‌ గఢ్‌ లోని బస్తర్ ప్రాంతానికి ఆర్‌ కే వెళ్లిపోయి ఉంటారని చెపుతున్నారు. ఈ ప్రాంతంలో సమాంతర ప్రభుత్వం నడుస్తోంది. సాధారణ పౌరులు - పోలీసులు ఈ ప్రదేశంలోకి ప్రవేశించలేరని చెపుతున్నారు. మిలటరీ బలగాలు కూడా లోనికి వెళ్లలేనంత దట్టమైన దండకారణ్య ప్రదేశమని చెపుతున్నారు. పూర్తిగా గిరిజన బలంతో మావోయిస్టులు ఇక్కడ సురక్షితంగా ఉంటారని తెలుస్తోంది. ఇప్పుడు ఆర్‌ కే ఈ ప్రదేశంలో ఉంటారని వారు భావిస్తున్నారు.

ఇదిలాఉండ‌గా ఏఒబిలోని రామగుండం అటవీ ప్రాంతంలో ఈ నెల 24న జరిగిన బూటకపు ఎన్‌ కౌంటర్‌ కు ప్రతీకారం తీర్చుకుంటామని మావోయిస్టు పార్టీ ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శి చలపతి (కైలాసం) హెచ్చరించారు. మీడియాకు విడుదల చేసిన ఆడియో టేప్‌ లో ఆయన మాట్లాడుతూ విద్రోహుల మూలంగా ఈ సంఘటన చోటుచేసుకుందని, పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపి హత్యలు చేసి ఎన్‌ కౌంటర్‌ గా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఎన్‌ కౌంటర్‌ కు కారకులైన వారిని శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు. పోలీసులు సాగించిన బూటకపు ఎన్‌ కౌంటర్‌ ను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని, ఆంధ్రప్రదేశ్ - ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు - నవీన్ పట్నాయక్ బూటకపు ఎన్‌ కౌంటర్‌ కు కారకులని ఆయన ఆరోపించారు. ఆదివాసీ ప్రాంతంలో ఉన్న బాక్సైట్ - అటవీ సంపదను దోచుకునే చర్యల్లో భాగంగా ప్రజలకు నాయకత్వం వహిస్తున్న తమ పార్టీని నిర్మూలించి సామాజ్య్రవాదులకు సంపదను అప్పగించేందుకే మావోయిస్టు పార్టీని లక్ష్యంగా చేసుకున్నారని ఆయన అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News