ట్రంప్‌..ఫేస్‌ బుక్ జుక‌ర్ ల మ‌ధ్య మాట‌ల తూటాలు

Update: 2017-09-28 08:23 GMT
వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రోసారి త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు సంధించారు.ఈసారి ఆయ‌న విమ‌ర్శ‌ల‌కు టార్గెట్ అయ్యింది ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుక‌ర్ బ‌ర్గ్‌.  గ‌త ఏడాది జ‌రిగిన అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో సోష‌ల్ మీడియా దిగ్గ‌జ‌మైన ఫేస్‌ బుక్ త‌న‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేసింద‌ని ట్రంప్ తాజాగా ఆరోపించారు. ట్విట్ట‌ర్‌ ను వేదిక‌గా చేసుకొన్న ట్రంప్‌.. ఫేస్ బుక్ పై విమ‌ర్శ‌ల ట్వీట్ చేశారు.

త‌న‌కు కొన్ని నెట్ వ‌ర్క్ లు ఎప్పుడూ వ్య‌తిరేక‌మేన‌ని ఫేస్ బుక్‌ పై మండిపాటును ప్ర‌ద‌ర్శించారు ట్రంప్‌. త‌న‌కు వ్య‌తిరేకంగా ప‌ని చేసే వారంతా క‌లిసి కుట్ర ప‌న్నిన‌ట్లుగా ఆరోపించిన ఆయ‌న‌.. ఈ సంద‌ర్భంగా కొన్ని మీడియా సంస్థ‌ల పేర్ల‌ను ప్ర‌స్తావించారు. 2016 ఎన్నిక‌ల్లో ఫేస్ బుక్ తో పాటు.. న్యూయార్క్ టూమ్స్‌.. వాషింగ్ట‌న్ పోస్ట్ లు త‌న‌కు వ్య‌తిరేకంగా ప‌ని చేసిన‌ట్లుగా ఆరోపించారు.

ట్విట్ట‌ర్ వేదిక‌గా చేసుకొని ట్రంప్ చేసిన ఆరోప‌ణ‌ల్ని ఫేస్ బుక్ సీఈవో జుక‌ర్ తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఫేస్ బుక్ త‌న‌కు వ్య‌తిరేకంగా ప‌ని చేసిందంటూ ట్రంప్ చేసిన ఆరోప‌ణ‌ను జుక‌ర్ కొట్టిపారేశారు. ట్రంప్‌న‌కు మ‌ద్ద‌తుగా ప‌ని చేసిన‌ట్లుగా ప్ర‌తిపక్షం ఆరోపిస్తోంద‌న్న విష‌యాన్ని గుర్తు చేశారు. ట్రంప్ ఆరోప‌ణ‌ల్లో ఎలాంటి నిజం లేద‌న్న ఆయ‌న‌.. రెండు పార్టీలు త‌మ‌కు ఇష్టం లేని ఆలోచ‌న‌లు.. విష‌యాల గురించి నిరాశ చెందుతాయ‌న్నారు.

తాము ఎప్పుడూ ఎవ‌రి ప‌క్షాన నిల‌వ‌లేద‌ని.. అంద‌రికి ఉప‌యోగ‌ప‌డే ఆలోచ‌న‌తో ఒక ఫ్లాట్ ఫాం న‌డుపుతున్న‌ట్లుగా జుక‌ర్ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకొని అమెరికా అధ్య‌క్షుడు.. ఫేస్ బుక్ సీఈవోల మ‌ధ్య సాగుతున్న మాట‌ల యుద్ధం రానున్న రోజుల్లో మ‌రే తీరులో సాగుతుందో చూడాలి.
Tags:    

Similar News