కేసీఆర్ పై గెలిచిన ఒకే ఒక్కడు

Update: 2016-01-09 07:02 GMT
తెలంగాణలో టీఆరెస్ ను, సీఎం కేసీఆర్ ను ఎదిరించేవారే లేరు. బీజేపీ - కాంగ్రెస్ - టీడీపీ - ఎంఐఎం అన్నీ చతికిలపడిపోయాయి. కాంగ్రెస్ నేతల్లో కొందరైతే కేసీఆర్ ను మాట అనడానికి కూడా మొహమాటపడిపోతున్నారు. కానీ, అదే కాంగ్రెస్ పార్టీలో ఒకే ఒక్క నాయకుడు మాత్రం మొనగాడులా పోరాడి కేసీఆర్ పై గెలుస్తున్నారు. ఆయనే మాజీ మంత్రి మర్రిశశిధర్ రెడ్డి.  టీఆరెస్ ప్రభుత్వ నిర్ణయాలను కోర్టుల్లో సవాల్ చేస్తూ కొరకరాని కొయ్యగా మారారు.

హైదరాబాద్ లో సీమాంధ్ర ఓటర్లను తొలగిస్తున్నారని హైకోర్టుకు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి సక్సెస్ సాధించిన ఆయన ఇప్పుడు  గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియను కుదిస్తూ టీఆర్ ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపైనా న్యాయ పోరాటం చేసి విజయం సాధించారు. హైకోర్టు కూడా గ్రేటర్ ఎన్నికల ప్రక్రియ కుదించడాన్ని తప్పుపట్టింది. జీహెచ్ ఎంసీలో సీమాంధ్రకు చెందిన వారి ఓట్ల తొలగింపు వ్యవహారంపై మర్రి శశిధర్‌ రెడ్డి అలుపెరగని పోరాటం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడమే కాకుండా ఆధారాలు కూడా సమర్పించారు. ఈ ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం క్షేత్రస్థాయిలో విచారణ జరిపింది. చివరికి జిహెచ్‌ ఎంసి కమిషనర్‌ గా ఉన్న సోమేష్ కుమార్ పై వేటుపడేలా చేశారు.

ఎన్నికల ప్రక్రియను తమకు అనుకూలంగా మలచుకోవడానికి టీఆరెస్ చేస్తున్న కుట్రలను ఆయన భగ్నం చేస్తున్నారు. గ్రేటర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి దానం నాగేందర్‌ ఉన్నప్పటికీ... జానారెడ్డి - జైపాల్ రెడ్డి - వీహెచ్ వంటి నేతలు ఇంకా రాజకీయ సన్యాసం తీసుకోనప్పటికీ.. అందరినీ కాదని టీఆరెస్ ను ఎదిరించడంలో శశిధర్‌ రెడ్డి ఒక్కరే నిలవగలుగుతున్నారు. మిగతావారంతా తుస్సుమంటున్నారు.
Tags:    

Similar News