కంపెనీ అంటే ఇది.. ఉద్యోగుల తొలగింపుల వేళ 5,000 మందికి కొత్త జాబ్స్‌!

Update: 2022-12-14 05:00 GMT
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాలు, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావాలు, కోవిడ్‌ అనంతర పరిస్థితులు, తగ్గిపోతున్న ప్రకటనల ఆదాయం వంటి కారణాలతో సాధారణ కంపెనీలతో పాటు దిగ్గజ కంపెనీలు.. గూగుల్, ట్విట్టర్, ఫేస్‌ బుక్, సిస్కో, అమెజాన్‌ వంటివి సైతం ఉద్యోగులను భారీగా తగ్గించుకుంటున్న సంగతి తెలిసిందే. తద్వారా నష్టాలను తగ్గించుకోవడం, ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడానికి ప్రణాళికలు రచించుకుంటున్నాయి.

మనదేశంలో సైతం ఈ ఏడాది పెద్దగా ఉద్యోగుల తొలగింపు లేకపోయినా వచ్చే ఏడాది మాత్రం బాగానే ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వచ్చే ఏడాది భారతీయ టెకీలకు కష్టకాలమేనని నొక్కి వక్కాణిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీలు సైతం భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న వేళ ఒక కంపెనీ మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉద్యోగులను నియమించుకుంటుండటం విశేషం.

ఆర్ధిక మాంద్య భయాలు, ఆర్దిక మందగమనంతో ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు జాబ్స్‌ లేఆఫ్స్‌ కు తెగబడుతుంటే బర్గర్‌ దిగ్గజం,, మెక్‌డొనాల్డ్స్‌ మాత్రం ఉద్యోగులను భారీగా నియమించుకుంటోంది. ఒక్క భారత్‌ లోనే ఏకంగా 5000 మందిని నియమించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

2025 నాటికి భారత్‌లో తమ ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేస్తామని మెక్‌డొనాల్డ్స్‌ ఇండియా తాజాగా ప్రకటించింది. రాబోయే మూడేళ్లలో ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేసేందుకు కసరత్తు సాగిస్తున్నామని మెక్‌డొనాల్డ్స్‌ ఇండియా ఎండీ రాజీవ్‌ రంజన్‌ వెల్లడించారు. ప్రస్తుతం తమ వద్ద 5000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. ఈ సంఖ్యను మూడేళ్లలో రెట్టింపు చేస్తామని వివరించారు.

2025 నాటికి భారతదేశ ఉత్తర, తూర్పు ప్రాంతంలో మెక్‌డొనాల్డ్స్‌ అవుట్‌లెట్ల సంఖ్యను 300కు పెంచాలని ఆ కంపెనీ నిర్ణయించింది. కంపెనీ విస్తరణ ప్రణాళికలో భాగంగా మెక్‌డొనాల్డ్స్‌ అస్సాంలోని గువహటిలో అతిపెద్ద రెస్టారెంట్‌ను తాజాగా ప్రారంభించింది.

6700 చదరపు గజాల విస్తీర్ణంలో ఒకే సమయంలో 220 మందికి ఆతిధ్యం ఇచ్చేలా గువహటిలోని రెస్టారెంట్‌ను అందుబాటులోకి తెచ్చింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News