బెజవాడలో భోజనం రూ.20.. ఈ నయా అన్నపూర్ణ ఎవరంటే?

Update: 2022-11-20 04:53 GMT
ఒక ఇడ్లీ రూ.20 వసూలు చేస్తున్న రోజులు ఇవి. అలాంటిది భోజనం అంటే కనీసం వంద నోటు ఇచ్చుకోవాల్సిందే. అందుకు భిన్నంగా సామాన్యుడు సైతం.. శుచిగా.. శుభ్రంగా తినేందుకు వీలుగా భోజనాన్ని సిద్ధం చేయటం.. అది కూడా కేవలం రూ.20లకు మాత్రమే తీసుకోవటం ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమా? అంటే.. నో అనేస్తారు. కానీ.. ఈ కాలంలోనూ అన్నపూర్ణను తలపించేలా వ్యాపారాన్ని నిర్వహించేవాళ్లు కొందరు ఉంటారు. ఆ కోవలోకే వస్తుంది విజయవాడలోని ఈశ్వర్ ఛారిటీస్ వారు ఏర్పాటు చేసిన హోటల్.

ఈ హోటల్ లో భోజనం కేవలం రూ.20 మాత్రమే వసూలు చేస్తారు. తీసుకుంటున్నది అతి తక్కువ మొత్తమే అయినా.. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా.. అందరూ భోజనం చేసేలా సిద్ధం చేయటం వీరి ప్రత్యేకతగా చెప్పాలి. విజయవాడ నగరానికి వచ్చే వారు ఎవరైనా సరే.. ఆకలితో ఇబ్బంది పడకుండా.. అతి తక్కువ మొత్తానికి భోజనాన్ని అందించటమే లక్ష్యంగా ఈ భోజనశాలను నిర్వహిస్తున్నారు.

బయట భోజన శాల అన్న బోర్డు ఏమీ లేకుండా నిర్వహిస్తున్నప్పటికీ.. దీని గురించి ఆ నోటా ఈ నోటా విని వచ్చే వారెందరో. గ్రామీణ ప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చే వారితో పాటు.. పోటీ పరీక్షల కోచింగ్ కోసం విజయవాడకు వచ్చేవారు.. అల్ప ఆదాయ వర్గాల వారు ఈ భోజన శాలలో భోజనం చేస్తుంటారు. ఎందరి ఆకలినో తీర్చే ఈ భోజనశాలలో.. భోజనాన్ని సిద్ధం చేసే విధానం.. దాన్ని వడ్డించే తీరు చూసినప్పుడు.. ఇంత హైజెన్ గా నిర్వహిస్తున్న వైనానికి వావ్ అనకుండా ఉండలేం.

ఇంతకీ ఈ భోజనశాల ఉన్నది ఎక్కడంటే.. శిఖామణి సెంటర్. ఆసుపత్రులు.. విద్యా సంస్థలతో పాటు.. ప్రభుత్వ.. ప్రైవేటు ఆఫీసులతో కిటకిటలాడే సెంటర్ లో దీన్ని నిర్వహిస్తున్నారు. రెండు కూరగాయలతో కూడిన కూర.. ఒక కప్పు నిండా పప్పు కూర.. సాంబారు.. మజ్జిగతో పాటు అరకేజీ అన్నాన్ని వడిస్తారు. దీంతో పాటు ఒక రోటి పచ్చడి.. వాముతో కలిపిన పచ్చి మిర్చి.. ఉల్లిపాయను ముక్కలుగా ఇస్తుంటారు. ఏ టైంకు వెళ్లినా వేడి వేడి అన్నాన్ని వడ్డించటం వీరి ప్రత్యేకత. ట్రస్టు ఆధ్వర్యంలో ఈ భోజనశాలను అందిస్తున్నట్లు చెబుతారు. వీలైనంత మందికి నాణ్యమైన భోజనాన్ని అందించటమే లక్ష్యంగా తమ భోజన శాలను ఏర్పాటు చేసినట్లుగా నిర్వాహకురాలు మాధవి తెలిపారు. తక్కువ ధరకు ఇంత నాణ్యంగా భోజనం అందించే వీరిని తప్పనిసరిగా అభినందించాల్సిందే.
Tags:    

Similar News