అమెరికా దాడుల‌ను అతిగా చెప్తున్నారంటున్న సంఘ్‌

Update: 2017-03-15 07:50 GMT
రాష్ర్టీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్‌(ఆర్ ఎస్ ఎస్‌) ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌క‌ట‌న చేసింది. జాత్యహంకారం కార‌ణంగా అమెరికాలో భారతీయులపై అక్కడక్కడా జరిగిన దాడులను మీడియా అతిగా చూపుతున్నదని సంఘ్ పరివార్‌ అంతర్జాతీయ వ్యవహారాలు పర్యవేక్షించే ఆర్‌ ఎస్‌ ఎస్‌ విశ్వవిభాగ్‌ నేత సదానంద్‌ సాప్రే అన్నారు. "ఇలాంటి దాడులు గతంలోనూ ప‌లుమార్లు జరిగాయి. అయినా ప్రస్తుతం మీడియా చిన్న ఘటనలను ఎత్తిచూపుతున్నది. మీడియా స్వభావమే అలాంటిది" అని ఆయన వ్యాఖ్యానించారు.

1960ల్లో ఉగాండాలో భారతీయులపై జరిగిన దాడులను ప్రస్తావిస్తూ ఈడీ అమిన్‌ పాలనలో అక్కడ భారతీయులందరిపైనా దాడులకు తెగబడి తరిమికొట్టారని స‌దానంద్ సాప్రే గుర్తుచేశారు. ప్రస్తుతం అమెరికాలో ఇలా జరుగుతుందా..? ఆస్ట్రేలియాలో ఇలా జరుగుతుందా..? అని ఆయ‌న‌ ప్రశ్నించారు. ఒకే కోణంలో అంతటినీ చూడటం సరికాదని, భారతీయులను రక్షిస్తున్న అమెరికన్లు చాలా మంది ఉన్నారన్న సంగతి గుర్తు ఎరగాలని చెప్పారు. గతంలో ఆస్ట్రేలియాలో భారతీయులపై జరిగిన దాడుల్లో కొన్ని ఉదంతాల్లో భారతీయుల తప్పు ఉన్నదని సాప్రే అన్నారు. ఆస్ట్రేలియాలో భారతీయులు లక్ష్యంగా దాడులు జరిగాయని మీడియా అసత్య కథనాలు రాసిందని, తాను విచారించగా అలాంటిదేమీ లేదని వెల్లడైందని చెప్పారు. చెదురుమదురు ఘటనలు ఎక్కడైనా జరుగుతాయని, భారత్‌లోనూ జరిగాయని ఆర్‌ ఎస్‌ ఎస్‌ విశ్వవిభాగ్‌ నేత అన్నారు. కొన్నేళ్ల‌ కిందట మంబయిలో బీహారీలపై జరిగిన దాడులను ప్రస్తావించారు.ఏమైనా దాడులు ఎక్కడ జరిగినా వాటిని ఖండించాలన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News