అందరికి అన్ని తెలుసు. కానీ.. చెప్పలేని పరిస్థితి. ఇదే ఇప్పుడు సరికొత్త కామెడీగా మారింది. కేవలం రెండు వారాల వ్యవధిలో ఏమాత్రం మిత్రపక్షం కాని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితో ప్రధానమంత్రి మోడీ రెండోసారి భేటీ కావటం ఎందుకు? ఈ ప్రశ్నకు ఎవరైనా రాజకీయ అంశాలే కారణంగా చెబుతారు.
వారి మధ్య చర్చకు వచ్చే అంశాలంటూ బోలెడన్ని చెబుతున్నా.. వాస్తవం అందరికి తెలిసిందే. ముందస్తుకు సంబంధించి ప్రధాని నుంచి పక్కా హామీ పొందేందుకే తాజా సమావేశమన్న విషయాన్ని టీఆర్ ఎస్ నేతలు తమ అంతర్గత సమావేశాల్లో బల్లగుద్ది మరీ చెబుతున్నా.. మీడియా మాత్రం అసలు విషయాన్ని రాయలేకపోతున్న పరిస్థితి ఉందని చెప్పక తప్పదు.
కేసీఆర్ అనుకున్నట్లుగా ముందస్తు జరిగితే.. అన్ని అనుకున్నట్లుగా జరిగితే అంతిమంగా లాభం చెందేది కేసీఆర్ మాత్రమే. ఎందుకంటే.. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే.. ఆ ఎన్నికల్లో మోడీ ఫ్యాక్టర్ తో పాటు.. రానున్న ఆర్నెల్ల కాలంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత మరింత ముదిరే అవకాశం ఉంది. దానికి చెక్ పెట్టేందుకు వీలుగా ముందస్తుకు వెళ్లటం ద్వారా డబుల్ థమాకా మోగించాలని కేసీఆర్ భావిస్తున్నారు.
కేసీఆర్ తాను అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలంటే కేంద్రం ఆశీస్సులు.. ముఖ్యంగా ప్రధాని మోడీ సానుకూలత చాలా ముఖ్యం. ముందస్తు కోసమని వెనుకా ముందు చూసుకోకుండా అసెంబ్లీని రద్దు చేసేస్తే.. కేంద్ర ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించకుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. గతంలో ఇలాంటి ప్రమాదం ఏపీలో చోటు చేసుకుంది. అలాంటి పరిస్థితే ఏర్పడితే.. భారీ నష్టం కేసీఆర్ కు కలుగుతుంది. ఇలాంటి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు వీలుగా.. మోడీ అభయహస్తం కోసమే తాజా ఢిల్లీ పర్యటనగా చెబుతున్నారు.
అయితే.. ఆ విషయాన్ని సూటిగా ప్రస్తావించలేక.. రకరకాలుగా విశ్లేషించటం.. జోనల్ వ్యవస్థ మొదలు రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ పనుల గురించి చర్చించేందుకే ప్రధానితో కేసీఆర్ భేటీ అని రాయటం కామెడీగా పలువురు అభివర్ణిస్తున్నారు. రాత్రి పూట సావధానంగా చర్చ అంటేనే.. విషయం ఏమిటో అర్థమైన వేళ.. లేనిది ఉన్నట్లుగా రాసే రాతల అంతరార్ధం సామాన్యులకు అర్థం కానట్లు ఉంటుందంటారా?