కన్నయ్యకు మీడియాకు అంత అనుబంధమేంటి..?

Update: 2016-03-25 13:27 GMT
జేఎన్ యూ విద్యార్థి నేత కన్నయ్య కుమార్ తెలుగు రాష్ట్రాల పర్యటన ఎట్టకేలకు ముగిసింది. హైదరాబాద్ హెచ్ సీయూలో రోహిత్ తల్లి రాధికను పరామర్శించటం.. హెచ్ సీయూలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించటం లాంటివి చేయాలని భావించినా ఆయనకు కుదర్లేదు. రోహిత్ తల్లిని కలిసి.. ఆమెను పరామర్శించారు. హెచ్ సీయూలో నిర్వహించాలని భావించిన బహిరంగ సభను పోలీసులు అనుమతి లభించకపోవటంతో.. తాను చెప్పాలనుకున్న మాటల్ని వామపక్ష వాదులు ఏర్పాటు చేసిన సభ ద్వారా కన్నయ్య శక్తి మేర  చెప్పి.. ఏపీకి వెళ్లారు.

ఆయన సభను అడ్డుకోవటానికి.. సభలో నిరసన వ్యక్తం చేయటానికి పలు ప్రయత్నాలు జరిగాయి. అలా తనను వ్యతిరేకిస్తున్న వారిపై విమర్శలు చేసిన ఆయన.. వారిపై జరిగిన దాడిని.. రక్తం వచ్చేలా పిచ్చ కొట్టుడు కొట్టేసిన అంశాల్ని కనీసం ప్రస్తావించలేదు. ఏకపక్ష వాదనలు వినిపించటంలో మొండిఘటం లాంటి కమ్యూనిస్టుల ఆలోచనలకు తగ్గట్లే కన్నయ్య కుమార్ వ్యవహరించటంపై ఎవరికి ఎలాంటి విస్మయం వ్యక్తం కాలేదు.

కానీ.. సమస్యల్లా.. ఆయనకు మీడియా బ్రహ్మరథం పట్టటం కాస్త కొత్తగా అనిపించింది. కన్నయ్య ఏమీ జాతీయ నాయకుడు కాదు. ఆ మాటకు వస్తే.. కమ్యూనిస్టు అగ్రనేతలు పర్యటించినా కూడా కన్నయ్యకు ఇచ్చిన కవరేజ్ లో పదో వంతు కూడా మీడియా ఇవ్వదేమో. కానీ.. తాజా తెలుగు రాష్ట్రాల పర్యటనల సందర్భంగా ఉద్రిక్తల్ని వీలైనంత మేర పెంచేలా చేయటంలో మీడియా తన వంతు పాత్ర పోసించినట్లుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న కన్నయ్య అంటూ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చిన తెలుగు మీడియా.. ఆయన వెళ్లే వరకూ కన్నయ్య వేసిన ప్రతి అడుగును ఫాలో కావటమే కాదు.. అతడికి భారీ ప్రచారం జరిగేలా.. అతని మాటల్ని వినిపించేలా చేయటం గమనార్హం. మీడియాలోని వామపక్ష వాదుల చొరవ తాజా భారీ కవరేజ్ కి కారణంగా భావిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కన్నయ్య వాదనను ఏకపక్షంగా వినిపించినా మీడియాపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అతని పర్యటనను విమర్శిస్తున్న వారిని.. వ్యతిరేకిస్తున్న వారి వాదనను కనీసం రికార్డు చేయటం లేదన్న ఆరోపణ వ్యక్తమవుతోంది. హైదరాబాద్ లోని కన్నయ్య సభలో చెప్పులు విసిరిన వారి ఉదంతాన్ని భారీగా కవర్ చేసిన మీడియా.. వారిపై జరిగిన పాశవిక దాడిని కవర్ చేసింది తక్కువగా చెప్పొచ్చు. చెప్పు విసిరిన నేతల్ని అత్యంత దారుణంగా వామపక్ష వాదులంతా కలిసి కుమ్మేయటాన్ని వ్యతిరేకించిన వారిని.. ఆ దాడికి పాల్పడిన వారిపై కేసులు పెట్టాలంటూ డిమాండ్ చేసిన వారి వాదనను కనీసం వినిపించకపోవటం చూసినప్పుడు.. కన్నయ్యకు తెలుగు మీడియా వేసిన పెద్దపీట వెనుక అసలు కారణం ఏమిటన్నది కాస్త ఆశ్చర్యకరంగా అనిపించక మానదు. దేశంలో అతి కొద్ది మంది మాత్రమే ఓకే చేసే వాదనను వినిపించిన ఒక వివాదాస్పద విద్యార్థి నాయకుడికి ఇంత భారీ కవరేజ్ మీడియా ఇవ్వటం ఏమిటి? అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చగా మారిందనటంలో సందేహం లేదు.
Tags:    

Similar News