చినబాబు గురించి కొత్త విషయాన్ని చెప్పిన ఇంగ్లిష్ మీడియా

Update: 2016-03-24 13:38 GMT
అదేం సిత్రమో కానీ.. సార్వత్రిక ఎన్నికలు జరిగిన నాటి నుంచి తెలుగు మీడియాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థలు ఆచితూచి అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన కొత్త సంగతుల్ని ఇంగ్లిషు మీడియా కాస్తో కూస్తో దూకుడుగా ప్రచురిస్తుంటే.. తెలుగు మీడియా మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రత్యేక పరిస్థితులే దీనికి కారణంగా చెప్పొచ్చు. ఇక.. తెలుగు మీడియాలో ప్రముఖ దినపత్రికలకు సంబంధించి ఎవరి ‘జెండా’ వారిదన్న వాదనకు తగ్గట్లే.. రాజకీయ పరిణామాలు.. పార్టీల్లో అంతర్గతంగా చోటు చేసుకుంటున్న మార్పుల గురించి పెద్దగా సమాచారాన్ని వార్తల రూపంలో ఇవ్వటం లేదన్న ఫిర్యాదు వినిపిస్తోంది.

ఇదే సమయంలో.. ఆంగ్ల మీడియాలో అందుకు భిన్నంగా రాజకీయ వార్తలకు సంబంధించి ఆసక్తికర కోణాల్ని ఆవిష్కరిస్తున్న దృశ్యం కనిపిస్తోంది.తాజాగా ప్రముఖ ఆంగ్ల దిన పత్రికనే చూస్తే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేశ్ బాబుకు మంత్రి పదవి వచ్చేస్తుందంటూ జోస్యం చెప్పేసింది. ఏదో మాట వరసకు చెప్పినట్లు కాకుండా పెద్ద విశ్లేషణే చెప్పే ప్రయత్నం చేసింది.

వాస్తవానికి లోకేశ్ ను కేంద్రమంత్రిని చేయాలని బాబు అనుకున్నారని.. కాకుంటే మోడీతో ఫ్రెండ్ షిప్ అంతగొప్పగా లేని నేపథ్యంలో.. కేంద్రమంత్రిగా కంటే.. తన చేతిలో ఉన్న రాష్ట్రమంత్రి పదవిని ఇచ్చేయాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఫ్యూచర్ వారసుడ్ని ప్రమోట్ చేయటానికి ఇదే మంచి సమయంగా ఆయన భావిస్తున్నట్లు సదరు పత్రిక చెప్పుకొచ్చింది. తమ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మంత్రివర్గంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయని నేపథ్యంలో.. తాజాగా మార్పులు చేయటంతో పాటు.. చినబాబును మంత్రిని చేసేందుకు బాబు రెఢీ అయినట్లుగా పేర్కొంది. లోకేశ్ బాబును మంత్రిని చేసేందుకు.. పలువురు మంత్రులు మేం రెఢీ అంటే మేం రెఢీ అంటూ త్యాగాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పుకొచ్చింది. ఇలాంటి వార్తలు మచ్చుకు కూడా కనిపించని తెలుగు మీడియాకు భిన్నంగా.. ఇంగ్లిషు మీడియా చెబుతున్న సంగతులు నిజమా? కాదా? అన్నది కాస్త వెయిట్ చేస్తే తేలిపోతుందని చెప్పాలి.
Tags:    

Similar News