కాంగ్రెస్ అధ్యక్ష పీఠం పై ద‌ళిత నేత‌

Update: 2022-10-19 23:30 GMT
దళిత వర్గానికి చెందిన 80 ఏళ్ల మల్లికార్జున ఖర్గే.. కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష పీఠం ద‌క్కించుకున్నారు. హోరా హోరీగా జ‌రుగుతుంద‌ని అంచ‌నా వేసిన‌.. అధ్యక్ష ఎన్నిక‌లు దాదాపు ఏక‌ప‌క్షంగానే మారిపోయాయి. ఈ క్ర‌మంలో భారీ మెజారిటీతో ద‌ళిత సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌ల్లికార్జున ఖ‌ర్గే ఎన్నిక‌య్యారు. అయితే.. ఖ‌ర్గే విజ‌యం అంత తేలిక‌కాదు. చాలా క‌ష్టించి.. పైకి వ‌చ్చారు. ఎవ‌రి సిఫార‌సుల కోసం.. ఆయ‌న ఎప్పుడూ ఎదురు చూడ‌లేదు. ప్ర‌జ‌ల‌ను న‌మ్ముకుని.. ప్ర‌జ‌ల మ‌ధ్యే విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇలా.. 9 సార్లు ఎమ్మెల్యేగా.. రెండు సార్లు పార్ల‌మెంటుకు ఎన్నియ్యారు. గాంధీల కుటుంబానికి అత్యంత విధేయుడిగా మాత్రం ఆయ‌న పేరు తెచ్చుకున్నారు.

 విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్నారు ఖ‌ర్చే. అంచెలంచెలుగా ఎదిగి కలబురిగి పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 9 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడు పర్యాయాలు సీఎం అవకాశాలను కోల్పోయినా ఏమాత్రం నిరాశ చెందలేదు. పార్టీపై తిరుగుబావుటా ఎగరేయలేదు. అధిష్ఠానం ఆదేశాల మేరకు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. ప్రారంభం నుంచి గాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రుడిగా పని చేస్తున్న ఖర్గేకు మంచి పేరుంది.  

ఏం చ‌దివారంటే..

1942 జూలై 21న కర్ణాటకలోని బీదర్‌లో జన్మించారు. కాంగ్రెస్ పట్ల ఆకర్షితులై 1969లోనే ఆ పార్టీలో చేరారు. గుల్బర్గాలోని సేథ్ శంకర్‌లాల్ లహోతి కాలేజీలో లా చదివారు. జూనియర్‌ న్యాయవాదిగా ఉన్నసమయంలోనే కార్మిక సంఘాల కేసులను వాదించి గెలిచారు. 1969లోనే గుల్బార్గా సిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడయ్యారు. 1972లో తొలిసారి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. 1973లో ఒక్ట్రోయి అబాలిషన్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టా రు. కర్ణాటకలో మున్సిపాలిటీ, స్థానిక సంస్థలు ఆర్థికంగా బలపడటానికి ఈ కమిటీ ఇచ్చిన నివేదిక కీలకంగా వ్యవహరించింది.

1976లో ప్రాథమిక విద్యా శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 16,000కుపై ఎస్సీ,ఎస్టీ టీచర్ల బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేశారు. దేవరాజ్ హయాంలో గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రిగా, పంచాయతీ రాజ్ మంత్రిగా‌, గుండూరావు కేబినెట్లో రెవెన్యూ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఎస్ఎం కృష్ణ హయాంలో హోంమంత్రిగా ఉన్నారు.

దక్షిణాది నుంచి ఆరో నేత

కాంగ్రెస్‌ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించే   మల్లికార్జున ఖర్గే రికార్డు సృష్టిస్తారు. ఇప్పటి వరకు పట్టాభి సీతారామయ్య, నీలం సంజీవరెడ్డి, కె.కామరాజ్‌, యస్‌.నిజలింగప్ప, పీవీ నర్సింహారావు పార్టీ అధ్యక్షులుగా వ్యవహరించారు. దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత గాంధీయేతర వ్యక్తి పార్టీ పగ్గాలు చేపట్టడం ఇదే తొలిసారి.  2009లో తొలిసారిగా జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టారు. మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వంలో కార్మికశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత రైల్వే మంత్రిత్వశాఖతోపాటు న్యాయశాఖ బాధ్యతలు కూడా చేపట్టారు. ఈ అనుభవంతో పార్టీని ఖర్గే ముందుకు తీసుకెళ్లగలరని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది.

హిందీ అన‌ర్గ‌ళం!

2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. లోక్‌సభలో పార్టీ బలం కేవలం 44 మంది మాత్రమే. ఆ ఎన్నికల్లో కలబురిగి లోక్‌సభ నియోజక వర్గం నుంచి ఖర్గే వరుసగా రెండో సారి ఎన్నికయ్యారు. పార్టీ అధిష్ఠానం లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన్ను నియమించింది. దీంతో ఆయన జీవితం కీలక మలుపు తిరిగింది. హిందీలో అనర్గళంగా మాట్లాడగలిగే సత్తా ఉన్న ఖర్గే.. తన వాక్చాతుర్యంతో అధికార బీజేపీని కట్టడి చేసేందుకు యత్నించేవారు. "మేము 44 మంది మాత్రమే అయినా.. మహాభారతంలో 100 మంది కౌరవులు పాండవులను నిలువరించ లేకపోయారు" అంటూ బీజేపీ ఎంపీలకు చురకలంటించేవారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News