హాట్‌ టాపిక్‌ గా చంద్రబాబుతో మాజీ ఎంపీ కుమారుడి భేటీ!

Update: 2023-01-04 09:29 GMT
వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ లో విజయం సాధించడానికి అన్ని పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఈ క్రమంలో పార్టీల్లో చేరికలపై ఆయా పార్టీల అధినేతలు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌ కుమారుడు జీవీ శ్రీరాజ్‌ చంద్రబాబుతో భేటీ కావడం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

శ్రీరాజ్‌ కు మంచి విద్యావేత్తగా పేరుంది. మరోవైపు రాజకీయంగానూ ఆయన చురుగ్గానే వ్యవహరిస్తున్నారు. సోషల్‌ మీడియాలో కూడా నిత్యం చురుగ్గా ఉంటారు. ఆ మాటకొస్తే హర్షకుమార్‌ కుటుంబం మొత్తం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రజా సేవలోనే ఉన్నారు. హర్షకుమార్‌ కరడు కట్టిన కాంగ్రెస్‌ వాది. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు టీడీపీలో చేరితో ఎంతవరకు సర్దుకోగలరనేదానిపైన ఆసక్తికర చర్చ సాగుతోంది.

చంద్రబాబుతో తాజాగా భేటీ అయిన జీవీ శ్రీరాజ్‌ దాదాపు 45 నిమిషాలు ఆయనతో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా శ్రీరాజ్‌ తన సోషల్‌ మీడియాలో తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పి.గన్నవరం నుంచి టీడీపీ తరఫున బరిలో దిగుతారని వార్తలు వస్తున్నాయి. అమలాపురం ఎంపీ సీటును ఆశించినప్పటికీ అక్కడ మాజీ లోక్‌ సభ స్పీకర్‌ జీఎంసీ బాలయోగి కుమారుడు హరీష్‌ మాథుర్‌ కు సీటు ఇప్పటికే ఖాయమైందని అంటున్నారు. ఈ నేపథ్యంలో హర్షకుమార్‌ కుమారుడు శ్రీరాజ్‌ పి.గన్నవరం సీటును ఆశిస్తున్నారని చెబుతున్నారు.

కాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో దళితుల్లో హర్షకుమార్‌కు మంచి పట్టుంది. హర్ష కుమార్‌ మాల సామాజికవర్గానికి చెందినవారు. ముఖ్యంగా కోనసీమ జిల్లాలో మాలల ప్రాబల్యం ఎక్కువ.

2004, 2009ల్లో అమలాపురం నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఎంపీగా హర్షకుమార్‌ గెలుపొందారు. 2014లో కిరణ్‌కుమార్‌రెడ్డి ఏర్పాటు చేసిన జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఒక కార్యక్రమంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కాళ్లకు నమస్కరించారు. ఈ వ్యవహారంలో దళిత సంఘాల నుంచి హర్షకుమార్‌ భారీగానే విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే 2019లో ఆయనకు టీడీపీ సీటు కేటాయించలేదు. మాజీ స్పీకర్‌ జీఎం బాలయోగి కుమారుడు గంటి హరీష్‌ మాథుర్‌కు సీటు కేటాయించింది.

2019 ఎన్నికల తర్వాత హరీష్‌ కుమార్‌ స్తబ్దుగా ఉండిపోయారు. అయితే విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే వివిధ ఉద్యమాల్లో పాల్గొని ఉండటం, దళిత స్పృహ, దూకుడుగా వ్యవహరించగల స్వభావం ఇవన్నీ ఉండటంతో వైసీపీ కూడా హర్షకుమార్‌ను తమ పార్టీలోకి చేర్చుకోవడానికి సిద్ధపడింది.

ఇందులో భాగంగా వైసీపీ ముఖ్య నేతల్లో  ఒకరిగా ఉన్న పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ను ఇటీవల హర్షకుమార్‌ దగ్గరకు పంపిందని అంటున్నారు.

కాగా ఇటీవల కొత్తగా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పీసీసీ) ఏర్పాటులో భాగంగా తనకు ఇచ్చిన రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్‌ పదవిని హర్షకుమార్‌ తిరస్కరించిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే విషయాన్ని ఆయన ఢిల్లీ వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేకు వివరించారు. ఈ నేపథ్యంలో హర్షకుమార్‌ కూడా టీడీపీలో చేరడం ఖాయమేనని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News