రాయ‌ల్ ఫ్యామిలీలోకి సామాన్యురాలు వెళితే..?

Update: 2018-07-18 01:30 GMT
గొప్పింటికి కూతుర్ని కోడ‌లిగా పంప‌టానికి ఏ తండ్రికి మాత్రం ఇష్టం ఉండ‌దు. రాజ‌రిక కుటుంబాల‌కు త‌మ కూతురు వెళితే.. ఆనందించే కుటుంబం ఉంటుంది. అయితే.. ఇదంతా పైకి మాత్ర‌మే. లోప‌ల తండ్రిగా ప‌డే బాధ అంతా ఇంతా కాద‌ట‌. ఆ విష‌యాన్ని స్వ‌యంగా చెప్పి సంచ‌ల‌నం సృష్టిస్తున్నాడు మేఘ‌న్ మార్క‌ల్ తండ్రి.

ఒక‌ప్పుడు న‌టిగా సుప‌రిచితురాలైన మేఘ‌నా.. ప్రిన్స్ హ్యారీని ప్రేమ వివాహం చేసుకోవ‌టం తెలిసిందే. ఇన్నాళ్లు సెల‌బ్రిటీగా గ‌డిపిన‌ప్ప‌టికీ.. రాయ‌ల్ ఫ్యామిలీలో త‌న కుమార్తె ఇమిడే విష‌యంలో చాలానే ఇబ్బందులు పుడుతున్న‌ట్లుగా ఆయ‌న చెబుతున్నారు. సామాన్య‌మైన ప్ర‌పంచం నుంచి రాజ‌రిక కుటుంబానికి వెళ్ల‌టం అంత తేలికైన విషయం కాద‌ని.. అక్క‌డి సంప్ర‌దాయాలు.. క‌ట్టుబాట్ల‌కు త‌గ్గ‌ట్లు ఉండ‌టం చాలా క‌ష్ట‌మంటున్నాడు.

న‌లుగురి ఎదుట చిరున‌వ్వులు చిందించే త‌న కుమార్తె ఏ మాత్రం సంతోషంగా లేద‌ని.. మేఘ‌న త‌న మ‌న‌సులో అపార‌మైన బాధ‌ను భ‌రిస్తుందంటూ ఆయ‌న వాపోయారు. ఆమె మోముపై క‌నిపించే చిరున‌వ్వు నిజం కాద‌న్న ఆయ‌న‌.. త‌న‌కు చిన్న‌నాటి నుంచి తెలిసిన త‌న కుమార్తె ముఖం మీద న‌వ్వును చూసి.. ఆమె మ‌న‌సు ఎలా ఉందో తాను చెప్ప‌గ‌ల‌న‌ని.. త‌న కుమార్తె క‌ళ్ల‌ల్లో.. మెహంలో.. చివ‌ర‌కు ఆమె న‌వ్వులో కూడా భ‌యం త‌న‌కు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌న్నారు.

మేఘ‌న్ కు వివాహ‌మైన నాటి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ తాను మాట్లాడ‌లేద‌ని.. ఆమెకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా.. ఫోన్ ఎత్త‌లేద‌న్నారు. స్వ‌యంగా క‌లుద్దామంటే ఆమె చిరునామా త‌న ద‌గ్గ‌ర లేదంటూ కంట‌త‌డి పెడుతున్న మేఘ‌న్ తండ్రి థామ‌స్ మాట‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. మీడియాలో ప్ర‌ముఖంగా వ‌చ్చిన ఆయ‌న మాట‌ల త‌ర్వాత అయితే.. ఆయ‌న‌కు త‌న కుమార్తెను క‌లిసే అవ‌కాశం చిక్కుతుందేమో చూడాలి.
Tags:    

Similar News