ఎల్లో ప్ర‌చారంపై మేక‌పాటి పంచ్ పేలిందే!

Update: 2017-08-31 08:32 GMT
అదిగో పులి.. అంటే ఇదిగో తోక‌- అనే మీడియా చానెళ్లు ఇప్పుడు పుట్ట‌గొడుగుల మాదిరిగా పుట్టుకొచ్చాయి. విశ్వ‌స‌నీయ‌త లేని వార్త‌ల‌తో ఊకదంపుడు గ్యాసిప్‌తో గంట‌ల కొద్దీ బ్రేకింగ్ న్యూస్‌ల‌తో తెలుగు వారికి షాకింగ్‌లు ఇస్తూ.. ప‌బ్బం గ‌డుపుకొంటున్నాయి. ఇలాంటి చానెళ్ల విష‌యంలో అత్యంత జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని చెబుతున్నారు నెల్లూరు ఎంపీ -  వైసీపీ సీనియ‌ర్ నేత మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి. రాష్ట్ర మీడియాలో బాధ్య‌తాయుత పాత్ర పెరుగుతుంద‌ని తాను మొద‌టి నుంచి ఆశిస్తున్నాన‌ని, అందుకే మీడియాపై గ‌తంలో పార్ల‌మెంటులో చ‌ర్చ జ‌రిగిన‌ప్పుడు తాను పాజిటివ్‌గా మీడియాను వెనుకేసుకు వ‌చ్చాన‌ని ఆయ‌న తెలిపారు.

అయితే, దుర‌దృష్ట‌వ శాత్తు.. తెలుగులోని ఓ చానెల్ త‌న‌నే టార్గెట్ చేసి.. లేనిపోని గ్యాసిప్‌ను నిజ‌మ‌నుకునే ప్ర‌చారం చేయ‌డం దౌర్భాగ్య‌మ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఓ చానెల్ త‌నను భ్ర‌ష్టు ప‌ట్టించేందుకు సిద్ధ‌మైంద‌న్నారు. తాను పార్టీ మారుతున్నాన‌ని, అది కూడా బీజేపీలోకి వెళ్లేలా అన్నీ సిద్ధం చేసుకున్నాన‌ని ఎలాంటి ఆధారాలూ లేని వార్త‌ల‌ను నిజ‌మ‌నుకులా ప‌దే ప‌దే ప్ర‌సారం చేస్తోంద‌ని విరుచుకుప‌డ్డారు.  ఇంత దౌర్భాగ్యపు వార్తలు ఎలా వస్తాయో తెలియడం లేదని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు.

"ఈ మధ్యాహ్నం ఉదయగిరి నుంచి నాకు ఎవరో ఫోన్ చేశారు. ఏంటి సార్ ఇలా వార్తలు వస్తున్నాయి సోషల్ మీడియాలో అని చెప్పాడు. అతను నాకు బాగా తెలిసిన శ్రేయోభిలాషే. ఇంతకుముందు ఇంకొకతను కూడా వచ్చి అదే మాట అన్నాడు. నేను పార్టీ మారుతున్నాన‌ని తెగ బ్రేకింగ్ న్యూస్ చూపిస్తున్నారంట‌. వీటిల్లో ఏమాత్రం నిజం లేదు. ఎట్లా వస్తాయో ఇటువంటి వార్తలు" అని మేకపాటి తెలిపారు. సోనియా మంచి ఫామ్‌లో ఉన్న‌ప్పుడే తాను జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరానని గుర్తు చేశారు.  త‌న నిబద్ధ‌త‌ను ఎవ‌రూ ప్ర‌శ్నించాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్నారు. తాను జ‌గ‌న్ నేతృత్వంలోనే ప్ర‌జాసేవ చేస్తాన‌ని చెప్పారు. ఇప్ప‌టికైనా నిజానిజాలు తెలుసుకుని మీడియా బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.
Tags:    

Similar News