కొండవీటి వాగుకు సింగపూర్ పరిష్కారం

Update: 2015-07-23 13:17 GMT
నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతం ఇప్పుడు ఒక ముంపు ప్రాంతం. వరదలు వస్తే.. కొండవీటి వాగుకు వరద నీరు వస్తే.. ఈ ప్రాంతం అంతా దాదాపు రెండు నెలలపాటు వరద ముంపులో ఉంటూ ఉంటుంది. ఈ ప్రాంతంలో పంటలు కూడా పూర్తి స్థాయిలో పాడైపోతాయి. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి ఇది. అందుకే ఈ ప్రాంతంలో రాజధాని అనగానే, ప్రతి ఒక్కరూ తొలుత అభ్యంతరం చెప్పారు. ముంపు ప్రాంతంలో రాజధానిని కడితే భవిష్యత్తులో పరువు పోతుందని కూడా ఎద్దేవా చేశారు. అయితే, చంద్రబాబు నాయుడు దానిని పట్టించుకోలేదు. కొండవీటి వాగు ముంపునకు ప్రత్యామ్నాయం ఆలోచించారు.

చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు సింగపూర్ బృందం కొండవీటి వాగు ముంపునకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటి వరకు కృష్ణా నదికి వరద వచ్చినప్పుడు గరిష్ఠంగా సముద్ర నీటి మట్టం కంటే 21.7 మీటర్ల ఎత్తున నీటి ప్రవాహం రికార్డు అయింది. కొండవీటి వాగుకు అత్యధికంగా వరద వచ్చిన రికార్డు 20 మీటర్లు. దీనిని దృష్టిలో ఉంచుకుని కృష్ణా నది కరకట్ట ఎత్తును 25 అడుగుల నుంచి 27 అడుగులకు పెంచాలని సింగపూర్ బృందం మాస్టర్ ప్లాన్ లో సూచించింది.

అంతేనా, కొండవీటి వాగుకు వచ్చిన వరద నీటిని ఇక నుంచి సద్వినియోగం చేసుకోవాలని కూడా సింగపూర్ బృందం నిర్ణయించింది. ఒక్కో టీఎంసీ నిల్వ చొప్పున రెండు భారీ రిజర్వాయర్లను నిర్మించనుంది. వాటి నుంచి రాజధాని ప్రాంతంలోని అసెంబ్లీ, సచివాలయం, వాణిజ్య ప్రాంతం తదితరాలకు అనుసంధానించేలా జల మార్గాన్ని నిర్మించనుంది. ఆయా ప్రాంతాలకు బోట్లలో వెళ్లేలా ఏర్పాట్లు చేయనుంది. మొత్తంమీద ఇప్పటి వరకు పెను విపత్తుగా ఉన్న కొండవీటి వాగును భవిష్యత్తులో పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దనుంది.
Tags:    

Similar News