హైదరాబాద్ లో ఆ పార్క్ వచ్చింది!

Update: 2022-07-25 04:46 GMT
కోవిడ్‌-19 కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకునేందుకు ప్రత్యేక పార్కును ఆదివారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. తెలంగాణ ప్రభుత్వం సహకారంతో కోవిడ్ యోధుల చొరవతో, బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 10లోని పంచవటి కాలనీలో పార్క్ ఏర్పాటు చేశారు. కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులు మరియు స్నేహితులతో డజన్ల కొద్దీ కోవిడ్ యోధులు ఈ పార్క్ లో మొక్కలు నాటారు. కొంతమంది తమ దగ్గరి వారి జ్ఞాపకార్థం మొక్కలకు చనిపోయిన వారి పేర్లతో పేపర్లు కట్టారు. "మిస్ యు బాబాయి", "మిస్ యు ఫ్రెండ్", "మిస్ యూ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్" అని కొన్ని నోట్స్ కట్టి మొక్కలో తమ వారిని చూసుకుంటున్నారు.

మహమ్మారి బారిన పడిన వారికి నివాళిగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి), అటవీ శాఖ సహకారంతో కోవిడ్ యోధుల బృందం ఈ పార్కును అభివృద్ధి చేసింది. వాక్‌వేలు.. బెంచీలు కూడా ఉండే ఈ పార్క్‌ను ఒక సంవత్సరం పాటు జీహెచ్ఎంసీ.. ఆ తరువాత వాలంటీర్లు నిర్వహించనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ఈ పార్క్ లో నిర్వహించారు.  బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్,  ఎమ్మెల్యే డి.నాగేందర్ సమక్షంలో ప్రారంభించారు. కోవిడ్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం ఈ మొక్కలు నాటారు. "ఇది వారిని గుర్తుంచుకోవడానికి.. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రానికి మంచి చేసే అద్భుతమైన మార్గం అని నేను భావిస్తున్నాను" అని  బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఫ్లెమింగ్ అన్నారు. తెలంగాణను పరిశుభ్రంగా, పచ్చగా మార్చేందుకు జరుగుతున్న కృషి స్ఫూర్తిదాయకమని, గత ఐదేళ్లలో రాష్ట్రంలో చాలా ప్రాంతాలు పచ్చగా మారుతున్నాయని అన్నారు.

ప్రోగ్రామ్ కోఆర్డినేటర్‌లలో ఒకరైన చరణ్ మాట్లాడుతూ.. కోవిడ్ బాధితుల జ్ఞాపకార్థం ఈ పార్క్ ఏర్పాటు చేయాలన్నది తెలంగాణ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంత థౌతం, నటాషా రామరత్నం మరియు శ్రీల ఆలోచన. వారి ఆలోచనలకు ప్రభుత్వం  స్థలం కేటాయించి మొక్కలు నాటి సాయం చేసింది. మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ చరణ్ కృతజ్ఞతలు తెలిపారు.

"ఎమోషనల్ డే ఇదీ.. మీరందరూ మొక్కలు నాటడం చూసి సంతోషంతో కన్నీళ్లు వచ్చాయి. మేము మొదటి దశను పూర్తి చేసాము మరియు రెండవ దశ వివరాలను త్వరలో పంచుకుంటాము" అని చరణ్ ట్వీట్ చేశాడు. అనేక స్వచ్ఛంద సంస్థలు.. వాలంటీర్లతో సమన్వయం చేసుకోవడం ద్వారా ప్రత్యేక ప్రదేశాలలో దశల వారీగా ప్రచారం కొనసాగుతుందని ఆయన చెప్పారు.

దేశంలోని ఇతర ప్రాంతాల నుండి కొంతమంది కోవిడ్ యోధులు కూడా ఈ కార్యక్రమంలో చేరారు. "ప్రతి చెట్టు పెరుగుదలతో  ఉష్ణోగ్రత తగ్గుతుంది.  వైరస్ బాధితుల పట్ల గౌరవం పెరుగుతుంది. భవిష్యత్తు తరాలకు పర్యావరణ నిబద్ధతకు చిహ్నంగా ఇది మారుతుంది.  ఇది సానుకూల సందేశాన్ని తీసుకురావడానికి కూడా ప్రయత్నిస్తుంది" అని కోవిడ్ వాలంటీర్లు సంతోషం వ్యక్తం చేశారు.
Tags:    

Similar News