మెట్రో శ్రీధ‌ర్ సీఎం అభ్య‌ర్థి..! కేరళలో బీజేపీది ఢిల్లీ త‌ర‌హా వ్యూహ‌మేనా..?

Update: 2021-03-05 11:39 GMT
రాజ‌కీయ పార్టీ అంతిమ ల‌క్ష్యం అధికారం. దానికోసం ఎన్నో ఎత్తులు వేస్తుంది.. మ‌రెన్నో వ్యూహాలు ర‌చిస్తుంది.. అందులో కొన్ని స‌క్సెస్ అవుతాయి.. మ‌రికొన్ని అభాసు పాల‌వుతాయి. ఇప్పుడు కేర‌ళ‌లో బీజేపీ ఓ వ్యూహాన్ని తెర‌పైకి తెచ్చింది. సాధార‌ణంగా అయితే.. ఆ రాష్ట్రంలో బీజేపీకి పెద్ద‌గా ప‌ట్టులేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న‌ ‌పార్టీ అనే హ‌డావిడి త‌ప్ప‌, పెద్ద‌గా ప్ర‌భావం చూపే అవ‌కాశం లేద‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. ఈ నేపథ్యంలో ఢిల్లీ త‌ర‌హా ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. మ‌రి, దీని ప్ర‌భావం ఎంత అన్న‌దే ఇప్పుడు చ‌ర్చ‌.

ఢిల్లీ గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆప్ ను ఎదుర్కొనేందుకు హ‌ఠాత్తుగా కిర‌ణ్ బేడీని రంగంలోకి దించింది బీజేపీ. ఆమె స్వ‌త‌హాగా బీజేపీ కార్య‌క‌ర్తా కాదు. అంత‌కు ముందు రాజ‌కీయాల్లో ఉన్న వ్య‌క్తి కూడా కాదు. ప్ర‌జ‌ల్లో ఆమెకున్న ప‌లుకుబ‌డిని ఓట్లుగా మ‌లుచుకునేందుకే ఈ ప‌థ‌కం వేసింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మైంది. అయితే.. ఆ పాచిక పార‌లేదు. బీజేపీ దారుణంగా ఓట‌మి చ‌విచూసంది దేశ రాజ‌ధానిలో. ఆ త‌ర్వాత కిర‌ణ్ బేడీ కూడా సైలెంట్ అయ్యారు.

ఇప్పుడు కేర‌ళ ఎన్నిక‌ల్లోనూ ఇదే సూత్రాన్ని అమ‌లు చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఈ రాష్ట్రంలో క‌మ్యూనిస్టులు, కాంగ్రెస్ దే హ‌వా. ఓ సారి ఎల్డీఎఫ్‌, మ‌రోసారి యూడీఎఫ్ ను అధికారంలో కూర్చోబెడుతుంటారు ఇక్క‌డ విద్యావంతులు. అయితే.. దేశం మొత్తం కాషాయ జెండా ఎగ‌రేయాల‌ని ఉబ‌లాట ప‌డుతున్న బీజేపీ.. దండ‌యాత్ర‌లు చేస్తూ ఓడిపోతూ ఉంది. ఇప్పుడు మ‌రోసారి ఎన్నిక‌లు వ‌చ్చాయి. ఈ సారి ప‌ట్టు పెంచుకోవాల‌ని చూస్తోందీ క‌మ‌ల‌ద‌ళం.

ఈ క్ర‌మంలో కేర‌ళ సీఎం అభ్య‌ర్థిగా మెట్రో మ్యాన్ శ్రీధ‌ర్ ను ప్ర‌క‌టించి, అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. ఇప్పుడు ఆయ‌న వ‌య‌సు 88 సంవ‌త్స‌రాలు. అద్వానీ ప్ర‌ధాని ప‌ద‌వికి ప‌నికిరాడ‌ని చూపిన వాటిల్లో ప్ర‌ధాన‌మైన‌ది ఇంతే వ‌య‌సు కావ‌డం ఇక్క‌డ గుర్తించాల్సిన అంశం. అంతేకాకుండా.. శ్రీధ‌ర‌న్ రాజ‌కీయ నాయ‌కుడు కాదు. ఈ వ‌య‌సులో ఆయ‌న అరంగేట్రం చేయ‌బోతుండ‌డం మ‌రో అంశం. అలాంటి ఆయ‌న‌ను ఏకంగా సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించడం మ‌రో ప్ర‌ధాన విష‌యం.

అయితే.. ఇక్క‌డ కూడా ఢిల్లీ వ్యూహాన్నే అమ‌లు చేస్తోందనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మెట్రో మ్యాన్ గా శ్రీధ‌రన్ కు విశేష‌మైన కీర్తి ఉంది. దాన్ని ఓట్లుగా మ‌లుచుకునేందుకే సీఎం అభ్య‌ర్థిగా రంగంలోకి దించుతోందంటున్నారు విశ్లేష‌కులు. శ్రీధ‌ర‌న్ కూడా త‌న ఉద్యోగ బాధ్య‌త‌లు స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించి ఎన్నో పుర‌స్కారాలు అందుకున్నారు. కానీ.. రాజ‌కీయాల్లోకి రాలేదు. కాబ‌ట్టి.. ఆ అధికారాన్ని కూడా చూస్తే బాగుంటుంద‌ని ఆయ‌న‌కు అనిపించి ఉండొచ్చు. అందునా.. ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి అంటే సామాన్య‌మైన విష‌యం కాదు. ఈ కార‌ణాల‌తో శ్రీధ‌ర‌న్ ఓకే చెప్పి ఉంటార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇక బీజేపీకి కేర‌ళ‌లో పెద్ద‌గా బ‌లం లేదు కాబ‌ట్టి సీఎం అభ్య‌ర్థిగా ఎవ‌రిని ప్ర‌క‌టించినా పోయేదేమీ లేదు. అయితే.. ఓ రాజ‌కీయ నాయ‌కుడి క‌న్నా.. శ్రీధ‌ర‌న్ ను ప్ర‌క‌టించ‌డం ద్వారా విష‌యం చ‌ర్చ‌ల్లో ఉంటుందని, త‌ద్వారా.. నాలుగు ఓట్లు పెరుగుతాయ‌నే ఆలోచ‌న బీజేపీ చేసి ఉండొచ్చ‌ని అంటున్నారు. మ‌రి, శ్రీధ‌ర‌న్ ఎలాంటి ఫ‌లితాన్ని న‌మోదు చేస్తారు? రాజకీయ నాయకుడిగా సరికొత్త పాత్రను మొదలు పెడతారా? కిరణ్ బేడీలాగా సైలెంట్ అయిపోతారా? అన్న‌ది చూడాలి.
Tags:    

Similar News