ట్రంప్ కు షాక్..అడ్డం తిరిగిన పొరుగుదేశం

Update: 2017-01-26 07:47 GMT
అమెరికా పొరుగున ఉన్న మెక్సికో స‌రిహ‌ద్దుల‌ చుట్టూ గోడ నిర్మిస్తామ‌ని అధ్య‌క్ష ఎన్నిక‌ల స‌మ‌యంలో ట్రంప్ వాగ్ధానం చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ముంద‌డుగు వేస్తూ  మెక్సికో స‌రిహ‌ద్దులో గోడ నిర్మించేందుకు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ కీల‌క‌మైన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ ఫై సంత‌కం చేశారు. దేశ భ‌ద్ర‌త కోసం - అక్ర‌మ వ‌ల‌స‌లు ఆపేందుకు ట్రంప్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారని అమెరికా అధికారులు వెల్ల‌డించారు. అయితే ట్రంప్ నిర్మించాల‌నుకుంటున్న స‌రిహ‌ద్దు గోడుకు తాము డ‌బ్బులు చెల్లించేదిలేద‌ని మెక్సికో స్ప‌ష్టం చేసింది.

దేశప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడిన మెక్సికో అధ్య‌క్షుడు ఎన్రిక్ పీనా నీటో త‌న సందేశంలో గోడ క‌ట్టేందుకు డ‌బ్బులు ఇచ్చేది లేద‌నే విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు. ఎన్నిక‌ల హామీ నెర‌వేర్చే ప్ర‌య‌త్నంలో ట్రంప్ త‌న  దేశ ఎగ్జిక్యూటివ్ ఆర్డ‌ర్‌ పై సంత‌కం చేశారని పేర్కొంటూ స‌రిహ‌ద్దు వ‌ద్ద గోడలు నిర్మించ‌డాన్ని మెక్సికో న‌మ్మ‌ద‌ని ఆయ‌న అన్నారు. అయితే ఈ నెల 31న వాషింగ్ట‌న్‌ లో ట్రంప్‌ ను క‌ల‌వాల్సిన ప‌ర్య‌ట‌నపై మాత్రం ఆయ‌న ఏమీ మాట్లాడ‌లేదు.

అక్రమంగా వస్తున్న ఇమ్మిగ్రెంట్లను అదుపు చేయడానికి ఈ సరిహద్దు గోడ నిర్మిస్తామని ట్రంప్ ఎన్నిక‌ల స‌మ‌యంలో హామీ ఇచ్చారు. శరణార్థులుగా వచ్చి అమెరికాలో సెటిలైపోతున్న వారి సంఖ్యను బాగా తగ్గించాలని ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. మెక్సికోతో పాటుగా సిరియా, ఇతర తీవ్రవాద దేశాల నుండి ఎవరూ అమెరికాలోకి రాకుండా తాత్కాలికంగా నిరోధించాలని యోచిస్తున్నారు. ఇరాక్‌ - ఇరాన్‌ - లిబియా - సోమాలియా - సూడాన్‌ - సిరియా - ఎమెన్‌ వంటి దేశాల నుండి శరణార్థులు రాకుండా చర్యలు తీసుకోనున్నారు. అయితే ఇవన్నీ తాత్కాలికమా లేక నిరవధికంగానా అనేది తెలియరాలేదని ఎబిసి న్యూస్‌ తెలిపింది. ఒకప్పటి రహస్య 'బ్లాక్‌ సైట్‌' నిర్బంధ కార్యక్రమాన్ని పునరుద్ధరించాలా వద్దా అనేది ట్రంప్‌ సమీక్షిస్తున్నారు. గ్వాంటానామో బేలో జైలును తెరవాలని, ముస్లిం బ్రదర్‌హుడ్‌ను తీవ్రవాద సంస్థగా ప్రకటించాలని ఆలోచిస్తున్నారు. చట్టబద్ధ ఇమ్మిగ్రెంట్లను కూడా లక్ష్యంగా చేసుకోవాలన్నది ట్రంప్‌ ఆలోచనగా వుంది. ప్రస్తుత శరణార్థుల విధానాన్ని పరిశీలిస్తున్నారు. అయితే ట్రంప్‌ తీసుకోబోయే చర్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతాయని భావిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News