చిన్నమ్మకు పంచ్ లాంటి షాకులు షురూ?

Update: 2016-12-26 05:16 GMT
అమ్మ తర్వాత చిన్నమ్మే. వినేందుకు బాగానే ఉన్నా.. ప్రాక్టికల్ గా అంత తేలికైన వ్యవహారం కాదన్నది చాలామంది రాజకీయ విశ్లేషకుల మాట. అయితే.. ఇలాంటి విశ్లేషణలు తప్పన్నట్లుగా.. చిన్నమ్మకు పాదాభివందనాలు చేసేవారు.. వంగి వంగి నమస్కారాలు చేసే వారిని.. వారి ఫోటోలు చూపిస్తూ.. అన్నాడీఎంకే పార్టీలో అంతే. ఆ మాటకు వస్తే తమిళనాడు రాజకీయాలంతే అంటూ తేల్చేసినోళ్లూ ఉన్నారు.

అన్నీ ఒక్కసారిగా మారిపోవు. కానీ.. మార్పు మాత్రమే శాశ్వితం అని నమ్మేవాళ్లు మాత్రం.. తమిళనాడు పాలిటిక్స్ మీద చాలామంది చేసే వ్యాఖ్యల్ని చూసి గమ్మున నవ్వుకున్నారు. జరిగేది జరగక మానదు. అలాంటప్పుడు తొందరపడటం ఎందుకన్నట్లుగా వ్యవహరించారు. అలాంటి వారినమ్మకం ఎంత నిజమన్నది తాజాగా రుజువు చేసే ఘటన ఇది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్నమ్మకు పరిమిత మోతాదులో మాత్రమే పవర్ ఇవ్వటానికి అన్నాడీఎంకే నేతలు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని అర్థం చేసేలా ఒక ప్రకటన వచ్చింది. విళుపురం జిల్లా అవలూర్ పెట్టైలో అన్నాడీఎంకే పట్టణ కార్యదర్శి సాదిక్ బాషా కొత్త పల్లవి ఎత్తుకున్నారు. అదేమంటే.. చిన్నమ్మకు కాదు.. సీఎం పన్నీరు సెల్వానికే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వాలని. ఈ మాటను నోటి మాటగా కాకుండా బ్యానర్ల రూపంలో పెట్టేశారు.

అంతేనా.. ఎంజీఆర్ బంధువు సుధా విజయకుమార్ కూడా ఇలాంటి డిమాండ్ నే తెర మీదకు తీసుకొచ్చారు. అప్పటివరకూ చిన్నమ్మకు వ్యతిరేకంగా పల్లెత్తు మాట బయటకు రాని వైనానికి భిన్నంగా.. పలు జిల్లాల్లో పన్నీరు సెల్వంను పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేయాలన్న డిమాండ్ తో బ్యానర్లు పుట్టుకొచ్చేశాయ్. ఈ పరిణామాలు చిన్నమ్మకు షాకింగ్ పంచ్ లుగా చెప్పక తప్పదు.

అతిగా ఆశపడేటోళ్లు బాగుపడినట్లు చరిత్రలో లేదని తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పిన రీల్ డైలాగ్ రియల్ లైఫ్ లో ఎంత నిజమన్నది తాజాగా పరిణామాల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. అంతేకాదు.. పార్టీలోని కింది స్థాయికార్యకర్తల్లో చిన్నమ్మ మీద ఉన్న వ్యతిరేకత పార్టీ చీలికలకు కారణం కావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. మరి..అమ్మ దగ్గర రాజకీయ ఎత్తుల్ని ఎన్నో చూసిన చిన్నమ్మ.. అలాంటి మేజిక్ ను ప్రదర్శిస్తారో లేదో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News