ఆడుతూ ఆడుతూ అక్క‌డికి వ‌చ్చేస్తున్నార‌ట‌!

Update: 2016-08-17 16:31 GMT
పోకెమ‌న్ గో... ఈ గేమ్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా సృష్టిస్తున్న సంచ‌ల‌నం అంతాఇంతా కాదు. స్మార్ట్ ఫోన్‌ లో ఆడుతూ ఆడూతూ వాహ‌నాల‌ను ఢీ కొట్టేవారు - ఏకంగా దేశ స‌రిహ‌ద్దుల్ని దాటుకుంటూ వెళ్లేవారి గురించి ఈ మ‌ధ్య చాలా వార్త‌లు విన్నాం. అయితే, ఇప్పుడీ ఆట వ‌ల్ల ప‌బ్లిక్ న్యూసెన్స్ ఎక్కువైపోతోందంటూ ఫిర్యాదులు పెరుగుతున్నాయి! గేమ్ ఆడుతున్న‌వారి వ‌ల్ల చాలా ఇబ్బందుల‌కు గురౌతున్నామ‌న్న కార‌ణంతో ఏకంగా ఆ ఆట‌ను త‌యారు చేసిన కంపెనీపైనే మిచిగాన్ కు చెందిన స్కాట్‌ - జెమీ దంప‌తులు కోర్టులో కేసు వేయ‌డం విశేషం!

స్కాట్‌ - జెమీల ఇంటి ముందు ఒక పార్క్ ఉంద‌ట‌. మామూలుగా అయితే రోజుకి ఓ ప‌దిమంది మాత్ర‌మే ఆ పార్కుకి వ‌చ్చి, కాసేపు సేద‌తీరి వెళ్తూ ఉండేవారు. అయితే, పోకెమ‌న్ గేమ్ వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచీ పార్క్ లో జ‌నాభా ఎక్కువైపోయార‌ని ఆ దంప‌తులు మండిప‌డుతున్నారు. ఏకంగా పార్క్ నిండిపోతోంద‌నీ వారు వాపోతున్నారు. ‘రెండు నెలల కిందటి వరకూ మా ఇంటి ముందున్న పార్కుకి మ‌హా అయితే ఓ 20 మంది మాత్ర‌మే వ‌చ్చి కూర్చునేవారు. కానీ, ఈ గేమ్ వ‌చ్చాక క‌నీసం వంద‌కంటే ఎక్కువ మంది పార్కుకి వ‌స్తున్నారు. అంతేకాదు, వాళ్లంతా మొబైల్ ఫోన్లు ప‌ట్టుకుని గంట‌ల కొద్దీ పార్కులోనే ఉండిపోతున్నారు. ఇంట్లోంచి బ‌య‌ట‌కి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. గేమ్ ఆడుతూ ఆనందంతో ర‌క‌ర‌కాల శ‌బ్దాలు చేస్తూ డిస్ట్ర‌బ్ చేస్తున్నారు’ అంటూ స్కాట్ దంపతులు వాపోతున్నారు. త‌మ‌కు భ‌ద్ర‌త లేకుండా పోవ‌డానికీ, ప్ర‌శాంత‌త లేకుండా పోవ‌డానికి ఆ గేమ్ కార‌ణ‌మైంద‌నీ, అందుకే ఏకంగా గేమ్ త‌యారీ దారుల‌పైనే కోర్టుకెక్కారు.

నిజానికి, ఇదొక్క‌టే కాదు.. ఇలాంటి చిత్ర‌మైన మ‌రికొన్ని కేసుల‌కు పోకెమ‌న్ కార‌ణం అవుతోంది! ఈ గేమ్ వ‌చ్చాక‌నే సెయింట్ క్లెయిర్ పోలీసుల‌కు ఫిర్యాదుల సంఖ్య ఎక్కువ‌య్యాయ‌ట‌. ఇంత‌కీ ఆ ఫిర్యాదులు ఏంటో తెలుసా... రోడ్ల మీద చాలామంది పోకెమెన్ ఆడుతున్నార‌నీ, వాహ‌నాల‌ను రోడ్డు ప‌క్క‌నే పార్కింగ్ చేసి, దాదాపు 16 గంట‌ల పాటు వ‌దిలేస్తున్నార‌న్న ఫిర్యాదులు అందుతున్నాయి. ఇలాంటి ఫిర్యాదులు అందుకున్న ప్ర‌తీసారి స‌ద‌రు వాహ‌న య‌జ‌మానిని కాంటాక్ట్ చేసి, వాహ‌నాలు రోడ్డు మీద నుంచి క్లియ‌ర్ చేయించ‌డం పోలీసుల‌కు కొత్త డ్యూటీగా మారింద‌ట‌. ఆ ఆట‌లో అంత మ‌హ‌త్యం ఏముందోగానీ... చాలామంది బానిస‌లు అయిపోతున్నారు. కొంత‌మంది ఆఫీసుల‌కు సెలువులు పెట్టి మ‌రీ కొన్నాళ్ల‌పాటు ఆడుకునేందుకు కేటాయించుకుంటున్నార‌ట‌! ఇదే చోద్యం..?
Tags:    

Similar News