టాప్ ప్లేస్‌ లో మైక్రోసాఫ్ట్‌: ఉద్యోగులు మెచ్చే సంస్థగా తొలిస్థానం

Update: 2020-07-29 08:10 GMT
ఉద్యోగులు మెచ్చే సంస్థ‌గా సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జం మైక్రోసాఫ్ట్ సంస్థ నిలిచింది. దేశంలోనే అత్యంత ఆకర్షణీయ ఉద్యోగ సంస్థల్లో మైక్రోసాఫ్ట్ ఇండియా తొలి స్థానంలో నిలిచింది. త‌ర్వాతి స్థానాల్లో శాంసంగ్ ఇండియా, అమెజాన్ ఇండియా నిలిచాయి. ఇన్ఫోసిస్ నాలుగో స్థానం.. మెర్సిడెజ్ బెంజ్ ఐదో స్థానంలో ఉంది. సాఫ్ట్‌వేర్ సంస్థ‌ల‌పై ఈ ఏడాది ర్యాండ్‌స్టడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ సర్వే చేసింది. ఈ స‌ర్వేలో పై ఫ‌లితాలు తేలాయి.

ఈ సర్వే ప్రకారం ఆర్థికంగా, పేరు ప్రఖ్యాతలు, సరికొత్త టెక్నాలజీల వినియోగంలో మైక్రోసాఫ్ట్ ఇండియా ముందు ఉందని తేలింది. 33 దేశాల్లోని 6,136 సంస్థల్లో పని చేస్తున్న 65 ఏళ్ల మధ్య ఉన్న 1.85 లక్షలమంది అభిప్రాయాలతో ర్యాండ్‌స్టడ్ ఈ సర్వేను చేసింది. స‌ర్వేలో భాగంగా భార‌త్‌లోని ఉద్యోగుల్లో 43% మంది మైక్రోసాఫ్ట్‌కు అత్యధిక మార్కులు వేశారు. టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకోవడం, పేరు ప్రతిష్టలు, ఆర్థిక పరిపుష్టి నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఇండియాలో పని చేయాలని చాలామంది కోరుకుంటున్న‌ట్లు స‌ర్వేలో తెలిసింది. ఈ సంస్థ‌కు వేతనం, ఉద్యోగ ప్రయోజనాల పట్ల ఆకర్షితులైనవారు 41% మంది ఉండ‌గా.. ఉద్యోగ భద్రత కారణంగా 40శాతం మంది మైక్రోసాఫ్ట్ పట్ల ఆసక్తి కనబరిచారు.

అయితే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ర్యాండ్‌స్టడ్ సర్వేలో టాప్ 10 ఆకర్షణీయ సంస్థల్లో భారత‌దేశం నుంచి కేవ‌లం 3 కంపెనీలే నిలిచాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్‌తో పాటు FMCG రంగం నుంచి ఐటీసీ స్థానం ద‌క్కించుకున్నాయి. మొత్తం 10 సంస్థల్లో అమెరికాకు చెందినవి నాలుగు, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియాలకు ఒక్కొక్కటి ఉన్నాయి. ఈ స‌ర్వే ప్ర‌కారం సాఫ్ట్ వేర్ సంస్థ‌ల స్థానాలు ఇలా ఉన్నాయి.. 1.మైక్రోసాఫ్ట్ 2. శాంసంగ్ 3.అమెజాన్ 4.ఇన్ఫోసిస్ 5. మెర్సిడెజ్ బెంజ్ 6. సోనీ 7.ఐబీఎం 8. డెల్ టెక్నాలజీస్ 9. ఐటీసీ గ్రూప్ 10.టీసీఎస్‌. ఐటీ, ఐటీ అనుబంధ రంగాలు, టెలికం, ఆటోమోటివ్ సంస్థల్లో పనిచేసేందుకు ఎక్కువమంది భార‌త ఉద్యోగులు ఆసక్తి కనబరుస్తున్నారు. FMCG, రిటైల్, ఈ కామర్స్, బీఎఫ్ఎస్ఐ సంస్థలు ఆ తర్వాత స్థానంలో నిలిచాయి. అయితే ఉద్యోగం చేయ‌డానికి ప్ర‌జ‌లు ఎంపిక చేసుకునే రంగాల్లో కొన్ని తొలి స్థానంలో నిలిచాయి. ఫోన్, కారు, పిల్లల సంరక్షణ సేవలు, సౌకర్యవంతమైన పనివేళలు వంటి సదుపాయాలు కల్పించే కంపెనీలకు 81 శాతం మంది ఉద్యోగులు ప్రాధాన్యం ఇస్తున్నట్లు స‌ర్వేలో వెల్ల‌డైంది.

మంచి శిక్షణ అవకాశాలు కల్పించే ఉద్యోగ సంస్థల కోసం పరిశోధ‌న చేస్తున్నట్లు 18-24 ఏళ్ల వయసున్న వారు 38 శాతం మంది తెలిపారు. సరికొత్త టెక్నాలజీ వినియోగానికి అవకాశం ఉన్న కంపెనీలు కావాలని 25 నుంచి 34 ఏళ్ల వయసు వారు 34 శాతం కోరారు. పని ప్రదేశం తమకు స‌మీపంలో ఉండాలని 55 నుంచి 65 ఏళ్ల వయసు ఉన్నవారు 32 శాతం మంది తెలిపార‌ని స‌ర్వే వివ‌రించింది.
Tags:    

Similar News