వాజ్‌ పేయికి నివాళిలో మ‌జ్లిస్ కార్పొరేట‌ర్ క‌ల‌క‌లం

Update: 2018-08-18 10:00 GMT
దేశం గ‌ర్వించ‌ద‌గ్గ నాయ‌కుడు - దివంగ‌త ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాజ్‌ పేయికి నివాళి అర్పించే కార్య‌క్ర‌మం తీవ్ర వివాదాస్ప‌ద రీతిలో తెర‌మీద‌కు వ‌చ్చింది. మ‌జ్లిస్ పార్టీ కార్పొరేట‌ర్‌ కు - బీజేపీ నాయ‌కులకు మ‌ధ్య మొద‌లైన విబేధాలు ముష్టియుద్ధం వ‌ర‌కు చేరాయి. దీంతో వివాదం పోలీసుల వ‌ద్ద‌కు చేరింది. ఇది జ‌రిగింది మ‌హారాష్ట్రలోని ఔరంగాబాద్‌ లో. మాజీ ప్రధాని వాజ్‌ పేయి మృతికి సంతాపం తెలుపేందుకు ఔరంగాబాద్ కార్పోరేటర్లు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో వాజ్‌ పేయి మృతికి సంతాపం తెలుపుతూ వివిధ పార్టీల కార్పొరేటర్లు ప్రతిపాదించగా ఎంఐఎం కార్పోరేటర్ ఈ తీర్మానాన్ని వ్యతిరేకించారు. దీంతో క‌ల‌క‌లం మొద‌లై ఈ వివాదం జ‌రిగింది.

బీజేపీ కార్పొరేటర్ రాజు వైద్య దివంగ‌త ప్ర‌ధాని వాజ్‌ పేయి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే, దీన్ని ఎంఐఎం కార్పొరేట‌ర్ స‌య్య‌ద్ మ‌తీన్ అడ్డుకున్నారు. దీంతో బీజేపీ కార్పొరేట‌ర్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ మ‌తీన్‌ పై దూసుకువెళ్లి దాడికి దిగారు. దేశం గ‌ర్వించే నాయ‌కుడి విష‌యంలో వ్య‌వ‌హ‌రించాల్సిన తీరు ఇదేనా అని ప్ర‌శ్నించారు. మ‌రికొంద‌రు బీజేపీ కార్పొరేట‌ర్లు మతీన్‌ పై పిడిగుద్దుల వర్షం కురిపించారు. దీంతో మార్షల్స్ రంగప్రవేశం చేసి మతీన్‌ ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అక్క‌డే ఉన్న సీసీ కెమెరాలో ఇవ‌న్నీ రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

కాగా, దీనిపై బీజేపీ - ఎంఐఎం నేత‌లు భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నారు. వాజ్‌ పేయికి నివాళి అర్పించే తీర్మానాన్ని వ్య‌తిరేకించిన మాట నిజ‌మేన‌ని మ‌తీన్ అంగీక‌రించాడు. అయితే ఇది ప్ర‌జాస్వామ్యరూపంలోనే చేయ‌గా..బీజేపీ కార్పొరేట‌ర్లు దాడి చేశార‌ని ఆరోపించాడు. మ‌రోవైపు బీజేపీ కార్పొరేట‌ర్లు ఆయ‌న తీరును త‌ప్పుప‌ట్టారు. స‌మావేశంలో మ‌తీన్ రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేశాడ‌ని - తీర్మానానికి అంత‌రాయం క‌లిగించాడ‌ని తెలిపారు. గ‌తంలో కూడా జాతీయ‌గీతం పాడే స‌మ‌యంలో వ్య‌తిరేకించార‌ని ఆరోపించారు. ఆయ‌న‌పై వేటు వేయాల‌ని బీజేపీ నేత‌లు డిమాండ్ చేశారు. కాగా, మ‌జ్లిస్ కార్పొరేట‌ర్ మ‌ద్ద‌తుదారులు మ‌రింత వివాద‌స్ప‌ద చ‌ర్య చేప‌ట్టారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న మజ్లిస్ మద్దతుదారులు స్థానిక బీజేపీ కార్పొరేట‌ర్‌ కు సంబంధించిన కారుపై దాడి చేసి అందులోని డ్రైవర్‌ను చితకబాదారు. ప్రజాస్వామ్య రూపంలో నిర‌స‌న తెల‌పాల్సిన మ‌జ్లిస్ నేత‌లు ఇలా దాడికి దిగ‌డం పైగా అభం శుభం తెలియ‌ని డ్రైవ‌ర్‌ను చిత‌క‌బాద‌డం ఏమిట‌ని సోష‌ల్ మీడియాలో చ‌ర్చ జ‌రుగుతోంది.


Tags:    

Similar News