చెబితే నమ్మరు కానీ మజ్లిస్ సభ పది గంటలకే ముగిసింది

Update: 2020-01-26 07:22 GMT
పౌరసత్వ సవరణ చట్టంతో పాటు ఇతరత్రా అంశాల మీద మోడీ సర్కారు మీద తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి కొన్ని రాజకీయ పక్షాలు. అందులో కీలకమైనది మజ్లిస్ పార్టీ. పౌరసత్వ సవరణ చట్టం మీద తానే లీడ్ తీసుకోవాల్సిన వేళ.. అందుకు భిన్నంగా ఆ మధ్యన ఎంబీటీతో పాటు మరికొన్ని సంస్థలు నిర్వహించిన నిరసన ర్యాలీ అనూహ్యంగా సక్సెస్ కావటం.. వేలాది మంది హైదరాబాద్ వీధుల్లో కదం తొక్కిన వైనం సంచలనంగా మారింది. తక్కువలో తక్కువగా చూసినా రెండు నుంచి మూడు లక్షల మంది నిరసనల కోసం రోడ్ల మీదకు రావటం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.

నిఘా వర్గాలు ఉలిక్కిపడేలా.. పోలీసులకు చెమటలు పట్టేలా వచ్చిన ఈ భారీ సమూహంతో హైదరాబాద్ లోని చాలా ప్రాంతాలు జనమయంగా మారాయి. అయితే.. ఒక్కటంటే ఒక్క ఘటన కూడా చోటు చేసుకోకుండా ప్రశాంతంగా నిరసన ముగియటంతో పోలీసులు ఊపిరి పీల్చుకోవటమే కాదు.. గుండెల మీద నుంచి భారీ భారం తొలగినట్లుగా ఫీల్ కావటాన్ని మర్చిపోలేం. ఈ నిరసన ర్యాలీ హాట్ టాపిక్ గా మారితే.. మజ్లిస్ వర్గాలకు ఒక పట్టాన జీర్ణించుకోలేనిదిగా మారింది. ఎందుకంటే.. హైదరాబాద్ లో మజ్లిస్ ప్రమేయం లేకుండా ఇంత భారీగా మైనార్టీ ప్రజలు రోడ్ల మీదకు రావటం.. ఎలాంటి తొందరపాటు చర్యలకు పాల్పడకుండా ఎంతో క్రమశిక్షణతో వ్యవహరించటంపై పెద్ద ఎత్తున చర్చ సాగింది.

తమ ప్రమేయం లేకుండానే మైనార్టీలు నిరసనలకు వచ్చిన వైనంపై మజ్లిస్ గుర్రుగా ఉంది. మైనార్టీలకు సంబంధించిన ఏ ఇష్యూ అయినా తాము తప్పించి మరెవరూ టచ్ చేయకూడదన్నట్లు భావించే పరిస్థితి. అందుకు భిన్నంగా చోటు చేసుకున్న పరిణామాలతో అలెర్ట్ అయిన మజ్లిస్ అధినేత.. సమయం.. సందర్భం చూసుకొని ఇదే అంశంపైన నిరసనలు చేపట్టాలని భావించారు. ఇందులో భాగంగా జనవరి 25 అర్థరాత్రి వేళ చార్మినార్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ చేస్తానని ఎంపీ అసద్ వెల్లడించారు. దీనికి పోలీసులు పర్మిషన్లు ఇవ్వకపోవటంతో కోర్టును ఆశ్రయించారు.

శనివారం రాత్రి పదకొండు వరకూ నిరసన సభను నిర్వహించుకునేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. సాధారణంగా మజ్లిస్ సభలు ఏవైనా రాత్రి పది గంటలకు మొదలై అర్థరాత్రి దాటే వరకూ సాగుతాయి. ఎన్నికల వేళలో మాత్రం నిబంధనలకు అనుగుణంగా ప్రచారాన్ని నిలిపివేస్తుంటారు. ఎన్నికలు కాని వేళ ఎప్పుడైనా సరే.. బాగా పొద్దుపోయిన తర్వాతే సభల్ని నిర్వహించటం అలవాటు.

తాజాగా నిర్వహించిన సభ విషయానికి వస్తే.. రెండు ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి. అందులో ఒకటి సభలో మజ్లిస్ అధినేత అసద్ కానీ.. ఆయన సోదరుడు అక్బరుద్దీన్ కానీ మాట్లాడకపోవటం. రెండోది ఎప్పుడూ లేని రీతిలో రాత్రి తొమ్మిదిన్నర కంటే ముందుగానే క్లోజ్ చేయటం. తొలుత పదకొండు గంటల వరకూ పర్మిషన్ ఇచ్చినట్లు చెప్పినా తర్వాత దాన్ని కుదించటంతో ఇలాంటి పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. మజ్లిస్ సభ ఇంత త్వరగా ముగియటం పట్ల పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఆదేశాలే అందుకు కారణంగా చెప్పక తప్పదు.
Tags:    

Similar News