దేశంలో ప్ర‌తిప‌క్షాల‌కు ఎంఐఎం కీల‌క స‌ల‌హా.. మోడీ గురించే!

Update: 2023-01-10 03:43 GMT
దేశంలో ప్ర‌తిప‌క్షాలు అన్నీ ఐక్యంగా ఏర్ప‌డి.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని గ‌ద్దె దింపాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో విప‌క్షాల ఉమ్మ‌డి ప్ర‌ధాని అభ్య‌ర్థి విష‌యంపై ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అయితే.. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ ప్ర‌ధాని అభ్య‌ర్థిత్వంపై మాత్రం కొంత చ‌ర్చ న‌డుస్తోంది. దీనికి త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని.. కొన్ని ప్ర‌తిప‌క్ష పార్టీలు చెప్పాయి. ముఖ్యంగా బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా ఇదే అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

మ‌రోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం మౌనంగా ఉన్నారు. కానీ, ఆయ‌న మ‌న‌సులో త‌నే ప్ర‌ధాని కావాల‌నే ఆకాంక్ష ఉంది. ఇక‌, బెంగాల్ సీఎం మ‌మ‌తాబెన‌ర్జీ, ఢిల్లీసీఎం కేజ్రీవాల్ కూడా ప్ర‌ధాని పీఠంపై క‌న్నేశారు. అయితే.. ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉండ‌డం.. ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య ఐక్య‌కార్యాచ‌ర‌ణ ఇంకా ఒక కొలిక్కి రాక‌పోవ‌డంతో వారంతా మౌనం వ‌హిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

అయితే.. ఇప్పుడు హైద‌రాబాద్‌కు చెందిన జాతీయ‌పార్టీ ఎంఐఎం అధినేత‌, ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ.. ఒక అద్భుత‌మైన ఐడియాను, స‌ల‌హాను ప్ర‌తిప‌క్షాల‌కు ఇచ్చారు. మోడీని ఓడించాలంటే.. మోడీని ఇంటికి పంపించాలంటే.. మీరు ఇలా చేయొద్దు..! అని ఆయ‌న స‌ల‌హా ఇచ్చారు. ప్ర‌స్తుతం ఒవైసీ ఇచ్చిన ఈ స‌ల‌హా పై దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ సాగుతోంది. ముఖ్యంగా ప్ర‌తిప‌క్షాలు కూడా అంత‌ర్మ‌థ‌నంలో ప‌డ్డాయి.

ఇంత‌కీ.. అస‌దుద్దీన్ ఇచ్చిన స‌ల‌హా ఏంటంటే..ప్రధాని మోడీపై2024 లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాల ప్రధాని అభ్యర్థిగా ఏ ఒక్కరిని పోటీకి నిలబెట్టినా అందువల్ల మోడీకే ప్రయోజనం క‌లుగుతుంద‌న్న‌ది అస‌దుద్దీన్ వాద‌న‌గా ఉంది.  బీజేపీని ఓడించేందుకు ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ విపక్షాలు పట్టుదలగా కృషి చేయాలన్న ఆయ‌న‌..  అదేస‌మ‌యంలో విపక్షాల నుంచి ఏదో ఒక అభ్య‌ర్థిని ప్ర‌ధానిగా ఎంపిక చేసి.. ముందుగానే ప్ర‌క‌టించ‌డం స‌రికాద‌ని అన్నారు.

ఇలా చేస్తే.. అది బీజేపీకే లబ్ధి చేకూరుస్తుందని చెప్పారు. మోడీ వెర్సస్ కేజ్రీవాల్ అయినా, మోడీ వెర్సస్ రాహుల్ గాంధీ అయినా మోడీ వ‌ర్సెస్ నితీష్ కుమార్‌, మ‌మ‌త ఇలా.. ఎవ‌రిని పేర్కొన్నా.. వారిని కేంద్రంగా చేసుకుని మోడీ రాజ‌కీయ వ్యూహాల‌కు తెరదీస్తార‌ని.. అప్పుడు ప్ర‌తిప‌క్షాలు ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డ‌తాయ‌నేది ఒవైసీ సూచ‌న. ఇది కూడా ఒకింత నిజ‌మే. సో.. ఆయ‌న చివ‌రిగా చెప్పింది ఏంటంటే.. ముందు విప‌క్షాలు ఐక్యంగా మెజారిటీ సాధించి.. చివ‌ర‌గా ఎన్నిక‌లు అయ్యాక‌.. ప్ర‌ధాని అభ్య‌ర్థిని తేల్చుకోవాల‌ని! మ‌రి ఏంచేస్తారో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News