నిజం.. మ‌జ్లిస్ కు 60 ఏళ్ల చ‌రిత్ర ఉంది

Update: 2018-03-02 07:19 GMT
మ‌తాన్ని ప్రాతిప‌దిగా చేసుకొని నిర్మోహ‌మాటంగా రాజ‌కీయం చేసే మ‌జ్లిస్ పార్టీని ఏర్పాటు చేసి స‌రిగ్గా 60 ఏళ్లు పూర్తి అయ్యాయి. అల్ ఇండియా మ‌జ్లిస్ - ఏ- ఇత్తేహాదుల్ ముస్లిమీన్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ పార్టీని షార్ట్ క‌ట్ లో మ‌జ్లిస్ గా పిలుస్తుంటారు. 1927 మార్చి 2న బ్రిటిష్ ఇండియాలో మ‌జ్లిస్ - ఏ- ఇత్తేహాదుల్ ముస్లిమీన్ గా మొద‌లైన  ఈ పార్టీ 1958 నుంచి క్రియాశీల‌క రాజ‌కీయ పార్టీగా అవ‌త‌రించింది.

హైద‌రాబాద్ పాత‌బ‌స్తీకి మాత్ర‌మే చాలాకాలం ప‌రిమిత‌మైన ఈ పార్టీ 1984లో హైద‌రాబాద్ లోక్ స‌భ స్థానాన్ని చేజిక్కించుకుంది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ ఆ స్థానాన్ని మ‌జ్లిస్ మాత్ర‌మే ప్రాతినిధ్యం వ‌హిస్తోంది. ఎలాంటి గాలిలో అయినా.. మ‌జ్లిస్ త‌న బ‌లాన్ని దాదాపుగా నిలుపుకుంద‌నే చెప్పాలి.

హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలోని దారుస్స‌లాం కేంద్రంగా ప‌ని చేసే ఈ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎంపీ.. ఏడుగురు ఎమ్మెల్యేలు.. ఇద్ద‌రు ఎమ్మెల్సీలు.. 44 మంది కార్పొరేట‌ర్లు ఉన్నారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో అయినా.. తెలంగాణ రాష్ట్రంలో అయినా అధికార‌ప‌క్షానికి మిత్ర‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించ‌టం మ‌జ్లిస్ కు ఒక అల‌వాటుగా మారింది.

ఈ విష‌యంలో మిన‌హాయింపు ఏమైనా ఉందంటే.. అది ఉమ్మడి రాష్ట్ర ఆఖ‌రి ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే. మ‌జ్లిస్ కు.. ఆయ‌న‌కు అస్స‌లు ప‌డేది కాదు.

2014 ముందు వ‌ర‌కు హైద‌రాబాద్ మీద‌నే ఫోక‌స్ చేసిన ఆ పార్టీ త‌ర్వాత నుంచి జాతీయ రాజ‌కీయాల మీద దృష్టి సారించింది. వివిధ రాష్ట్రాల్లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ త‌ర‌ఫున అభ్య‌ర్థుల్ని రంగంలోకి దించింది. పాత‌బ‌స్తీ ఫార్ములాను అమ‌లు చేయాల‌ని మ‌జ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఎంత‌గా ప్ర‌య‌త్నించినా.. ఆ ప్లాన్ ఎక్క‌డా వ‌ర్క్ వుట్ కాలేదు. కాకుంటే.. మ‌హారాష్ట్రలో మాత్రం అకౌంట్ ను ఓపెన్ చేయ‌గ‌లిగారు.

తెలంగాణ‌లో త‌న‌కున్న ప‌రిమిత‌మైన బ‌లాన్ని ఏపీ మొద‌లు క‌ర్ణాట‌క‌.. త‌మిళ‌నాడు.. మ‌హారాష్ట్ర.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్.. బిహార్ స‌హా ప‌లు రాష్ట్రాల్లో విస్త‌రించాల‌న్న ఆలోచ‌న‌లో ఉంది. సామాజిక‌.. ఆర్థిక‌.. విద్యా.. ఉద్యోగ రంగాల్లో వెనుక‌బ‌డిన ముస్లింలు.. ద‌ళితుల ప్ర‌యోజ‌నాలే ల‌క్ష్యంగాత‌మ పార్టీ ప‌ని చేస్తున్న‌ట్లుగా మ‌జ్లిస్ అధినేత అస‌ద్ చెబుతుంటారు. మ‌రి.. ఇన్ని మాట‌లు చెప్పే అస‌ద్‌.. తాను త‌ర‌చూ చెప్పే అభివృద్ధిని త‌మ ఇలాకా అయినా పాత‌బ‌స్తీలో ఎందుకు చూపించ‌ర‌న్న ప్ర‌శ్న‌కు మాత్రం స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి. ద‌శాబ్దాలుగా పాత‌బ‌స్తీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మ‌జ్లిస్ నేతృత్వంలో అక్క‌డి ప్ర‌జ‌ల బ‌తుకులు ఎందుకు బాగు ప‌డ‌టం లేద‌న్న విమ‌ర్శ త‌ర‌చూ ఎదుర‌వుతూ ఉంటుంది.

Tags:    

Similar News