మోదీకి ఓవైసీ చేసిన లాభం ఏంటో తెలుసా?

Update: 2020-11-10 18:01 GMT
దేశ‌వ్యాప్తంగా వివిధ చోట్ల ఉప ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌గా బీహార్ రాష్ట్రంలో శాస‌న‌స‌భ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. స‌హ‌జంగా బీహార్‌పై అంద‌రి చూపు ప‌డుతుంది. పైగా ఇక్క‌డ బీజేపీ సార‌థ్యంలోని ఎన్డీఏ కూట‌మి గెల‌వ‌డం క‌ష్టం అని అంచ‌నాలు రావ‌డంతో స‌హ‌జంగానే ఫోక‌స్ పెరిగింది. అయితే, ఇలాంటి వారి దృష్టిని ఆక‌ర్షించింది హైద‌రాబాద్ కేంద్రంగా ఉన్న ఎంఐఎం పార్టీ. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ఐదు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. ఈ గెలుపు నేప‌థ్యంలో కొత్త చ‌ర్చ మొద‌లైంది.

మూడు విడ‌తలుగా జ‌రిగిన బీహార్ ఎన్నిక‌ల కౌంటింగ్ ప్ర‌క్రియ‌లో అతిపెద్ద పార్టీగా బీజేపీ ఆవిర్భవించింది. ఇప్పటి వరకు బీజేపీ 124 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా, మహాకూటమి 114 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నది. ఎన్డీయే, మహాకూటమి మధ్య తేడా స్వల్పంగా ఉండటంతో రెండు కూటములు విజయం తమదే అంటే తమదే అని అంటున్నాయి. ఇలాంటి ఫ‌లితాల ఉత్కంఠ‌లో ఎంఐఎం ఐదు చోట్ల విజ‌యం సాధించ‌డం గ‌మ‌నార్హం. బీహార్‌లోని అమౌర్, కోచధామన్, బైసీ, బహదూర్ గంజ్, జోకిహట్ నియోజకవర్గాల్లో గెలిచిందని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు. మరికొన్ని స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చినట్లు సమాచారం. ఏ పార్టీ మద్దతు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగి తమ సత్తా చాటినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎంఐఎం 14 నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసింది. స‌హ‌జంగానే ముస్లిం ఓట్లు అధికంగా ఉన్న చోట ఆ పార్టీ బ‌రిలో దిగింది.

ఈ ఫ‌లితాల స‌ర‌ళిపై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత అధిర్ రంజ‌న్ ఛౌద‌రి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎంఐఎం పార్టీ అధినేత అస‌దుద్దీన్ ఓవైసీని ఓట్లు చీల్చే వ్య‌క్తిగా విశ్లేషించారు. ఓవైసీ పార్టీ పోటీ చేసిన చోట ముస్లిం ఓట్లు ఆ పార్టీకి ప‌డ‌గా హిందువుల ఓట్లు బీజేపీకి ప‌డ్డాయ‌ని వివ‌రించారు. ఈ నేప‌థ్యంలో బీజేపీకి లాభం జ‌రిగింద‌ని పేర్కొన్నారు. ఈ ప‌రిణామాల‌ను విశ్లేషించుకొని లౌకిక వాద పార్టీల నేత‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కాంగ్రెస్ ముఖ్య నేత హెచ్చ‌రించారు.

ఇదిలాఉండ‌గా, ఈ ఎన్నికల్లో ఆర్జేడీ 144 స్థానాల్లో పోటీ చేయగా, కాంగ్రెస్ కు 70 స్థానాల్లో పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ 70 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 19చోట్ల మాత్రమే లీడింగ్‌లో ఉండ‌టం గ‌మ‌నార్హం. సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ 70 స్థానాల్లో పోటీ చేసేందుకు ఆర్జేడీ అంగీకరించకుండా ఉంటె ఇప్పుడు ఫలితాలు మరోలా ఉండేవని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి 40 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చి, ఆర్జేడి 160కి పైగా స్థానాల్లో పోటీకి దిగినట్టయితే ఫలితాలు మహాకూటమికి అనుకూలంగా ఉండేవని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Tags:    

Similar News