రంగా విగ్రహం ఏర్పాటుపై మంత్రి, మాజీ ఎమ్మెల్యే మధ్య వాగ్యుద్ధం!

Update: 2022-11-22 10:30 GMT
మరణించి 32 ఏళ్లు గడిచిపోయినా ఏపీ రాజకీయాలు దివంగత నేత వంగవీటి మోహన్‌ రంగా చుట్టూనే తిరుగుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక జనాభాగా ఉన్న కాపులు ఈసారి జనసేనకు జైకొట్టే అవకాశం ఉండటంతో వైసీపీ అప్రమత్తమైంది. బడుగు, బలహీనవర్గాలు, కాపుల ఆరాధ్య దైవం వంగవీటి రంగా పేరును తలుస్తూ.. ఆయనను చంపించింది.. చంద్రబాబేనని ప్రచారం చేస్తోంది.

తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వంగవీటి రంగా విగ్రహం ఏర్పాటు వ్యవహారం స్థానిక వైసీపీ ఎమ్మెల్యే, పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన కారుమూరి నాగేశ్వరరావుకు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ మధ్య వాగ్యుద్ధానికి కారణమైంది.

వంగవీటి రంగా విగ్రహ ఏర్పాటు గురించి ఏర్పాటు చేసిన సభలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వంగవీటి రంగా విగ్రహాన్ని తొలగించి కాపుల సంక్షేమ సంఘం కార్యాలయంలో పెట్టిందెవరో మీరు గ్రహించాలని కాపు నేతలను ఉద్దేశించి అన్నారు. టీడీపీ ప్రభుత్వం రంగా విగ్రహాన్ని తొలగిస్తే తాము తిరిగి ప్రతిష్టించామని చెప్పుకున్నారు.

దీంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ మంత్రి మాటలకు అడ్డు తగిలారు. రంగా విగ్రహాన్ని తాము తొలగించలేదన్నారు. అసత్యాలను ఎందుకు చెబుతున్నారని మంత్రి కారుమూరిని నిలదీశారు.

ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు, కాపు నేతల అరుపులు, కేకలతో దద్దరిల్లింది. ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. రంగా గారి విగ్రహాన్ని తాము తొలగించలేదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ స్పష్టం చేశారు. ఇందుకు ఆధారాలు చూపాలని మంత్రి కారుమూరిని సవాల్‌ చేశారు.

మొత్తానికి ఏపీ రాజకీయాలన్నీ కాపుల చుట్టూనే తిరుగుతుండటం గమనార్హం. రాష్ట్రంలో కాపులు అత్యధికంగా 27 శాతం జనాభాగా అతిపెద్ద కులంగా ఉన్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అటు టీడీపీ, ఇటు బీజేపీ.. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నాయని అంటున్నారు. మరోవైపు వంగవీటి మోహన్‌ రంగా జపం చేస్తూ కాపులను ఆకట్టుకోవడానికి అధికార, ప్రతిపక్షాలు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News