కొడాలితో కొట్లాడేది ఎవరు...?

Update: 2022-04-04 02:30 GMT
బస్తీ మే సవాల్ అంటున్నారు వైసీపీ మంత్రి కొడాలి నాని. గుడివాడ సెంటర్ అయితే ఓకే. ఎవరు వచ్చినా రెడీ. గెలుపు నాదే. ఇదే నా మాట అంటూ ఒక్క లెక్కన టీడీపీ అధినాయకత్వాన్ని రెచ్చగొడుతున్నారు. గుడివాడ అంటే ఎన్టీయార్ గుర్తుకువస్తారు. ఆయన పుట్టిన నిమ్మకూరు అక్కడే ఉంది. ఇక ఎన్టీయార్ రాజకీయాల్లోకి వచ్చినపుడు ఫస్ట్ టైమ్ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచింది గుడివాడలోనే.

అలాంటి సీటుని నందమూరి, నారా ఫ్యామిలీ తరువాత కాలంలో వదిలేసుకుంది. మొదట రావి ఫ్యామిలీ, ఆ తరువాత  కొడాలి నాని వంటి వారే అక్కడ నుంచి గెలిచారు. ఇక కొడాలి నాని అయితే 2004 నుంచి ఈ రోజు వరకూ నాలుగు సార్లు గెలిచి నాటౌట్ అనిపించుకున్నారు. అందులో రెండు సార్లు టీడీపీకి వ్యతిరేకంగా గెలిచి జెండా పాతారు.

ఒక విధంగా కొడాలి గుడివాడ నాది అంటున్నారు. ఆయనకు ఆ సీటు చాలా అనుకూలంగా ఉంది. పార్టీలు మారినా జనాలు గెలిపిస్తున్నారు అంటే అది కొడాలి గొప్పతనమే అనుకోవాలి. ఆయనకు కమ్మ వారితో పాటు ఇతర సామాజిక వర్గాల దన్ను కూడా ఉంది.

ఇక ఎన్టీయార్ తరువాత ఆ ఫ్యామిలీ నుంచి నందమూరి హరిక్రిష్ణ 1999 ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన అన్న తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తే 11 వేల ఓట్లు మాత్రమే దక్కాయి. ఇక హరికి గుడివాడకూ చాలా అనుబంధం ఉంది. ఆయన బాల్యం అంతా నిమ్మకూరులోనే గడచింది. అలాంటి హరిక్రిష్ణను కూడా గుడివాడ జనాలు గెలిపించలేదు అంటే మిగిలిన వారసులు అక్కడ పోటీకి ఆసక్తి చూపుతారా అన్నదే ప్రశ్న.

రీసెంట్ గా కొడాలి నాని మరోసారి లోకేష్ మీద కామెంట్స్ చేస్తూ దమ్ముంటే గుడివాడలో నా పైన పోటీ చేసి గెలువు అనేశారు. దీంతో టీడీపీలో తర్జన భర్జన సాగుతోంది. అన్న గారి టీడీపీని చంద్రబాబు ఒడుపుగా  నడుపుతున్నారు. కానీ ఆయన సొంత నియోజకవర్గంలో మాత్రం పట్టు సాధించలేకపోతున్నారు అన్న విమర్శలు అయితే ఉన్నాయి.

పైగా కొడాలి నాని వైరి పక్షం నుంచి పదునైన బాణాలు వేస్తున్నారు. వాటిని తట్టుకోవడం చాలా కష్టంగా మారుతోంది. దాంతో ఈసారి ఎలాగైనా కొడాలి నానిని ఓడించాలని టీడీపీ స్ట్రాంగ్ గా డిసైడ్ అయింది అంటున్నారు. అయితే పోటీ ఎవరు చేయాలి అన్న దగ్గరే సమస్య వస్తోందిట.

కొడాలి నాని కోరినట్లుగా లోకేష్ ని బరిలోకి దింపుతారా అంటే లోకేష్ కి ఇప్పటికే మంగళగిరిలో ఓటమి ఉంది. 2024లో ఆయన కచ్చితంగా గెలిచి అసెంబ్లీకి రావాలనుకుంటున్నారు. పైగా తండ్రితో పాటు ఆయన కూడా ఏపీ అంతటా  ప్రచారం చేయాలనుకుంటున్నారు. దాంతో సేఫెస్ట్ సీటుని చూసుకుంటే బెటర్ అన్న మాట వినిపిస్తోంది.

మరో వైపు బాలయ్యను గుడివాడ బరిలో పెడితే ఎలా ఉంటుంది అన్న చర్చ కూడా సాగుతోందిట. బాలయ్యకు హిందూపురం హ్యాపీగా ఉంది. ఆయన ఈసారి గెలిచి కూడా  హ్యాట్రిక్ కొట్టే అవకాశాలు ఉన్నాయి. దాంతో అక్కడ నుంచి ఆయన రారంటే రారు అని అంటున్నారు. మరి ఎవరు పోటీ అంటే నందమూరి ఫ్యామిలీ నుంచి జయక్రిష్ణ కుమారుడు చైతన్య క్రిష్ణ నేను రెడీ అంటున్నారుట. ఆయన ఇప్పటికే కొడాలి నాని, వల్లభనేని వంశీల మీద ధాటీగా  విమర్శలు చేస్తున్నారు.

అయితే చైతన్య క్రిష్ణను పోటీకి పెడితే గట్టిగా ఉంటుందా అన్న బెంగ కూడా ఉందిట. మొత్తానికి చూస్తే కొడాలి చూస్తే బిగ్ సౌండ్ చేస్తున్నారు. కానీ ఇవతల వైపు నుంచి మాత్రం క్యాండిడేట్ తేలడంలేదు. మరి కొడాలితో కొట్లాడేది ఎవరు. ఏమో చంద్రబాబు రాజకీయం గ్రేట్. ఆయన ఈసారి పన్నే పద్మవ్యూహంలో కొడాలి చిక్కుకుంటారా. లేక బయటపడతారా. వెయిట్ అండ్ సీ.
Tags:    

Similar News