తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు - రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఖాతాలో కొత్త రికార్డ్ బ్రేక్ అయిందని అంటున్నారు. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ అసోసియేషన్ (నాస్కాం)కు చెందిన 25 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశారని చెప్తున్నారు. నాస్కాం తన ఇండియా లీడర్ షిప్ ఫోరంను మొట్టమొదటిసారిగా హైదరాబాద్‌లో నిర్వహించడం ద్వారా మంత్రి కేటీఆర్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. ఈ విషయాన్ని నాస్కాం ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ స్వయంగా వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం సందర్భంగా ఆర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ పాతికేండ్ల చరిత్రలో మొదటిసారిగా ముంబైని వదిలి మరోనగరాన్ని వేదికగా నిర్ణయించామని.. మంత్రి కేటీఆర్ ప్రయత్నం, పనితీరు వల్లే హైదరాబాద్ లో నిర్వహించామని చెప్పారు. ఫోరం ఏర్పాటుకు సిద్ధమైన క్షణంనుంచి విజయవంతంగా పూర్తయ్యేవరకు మంత్రి కేటీఆర్ చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఐటీ పరిశ్రమను ముందుకు తీసుకుపోతున్న తీరును గుర్తించి తాము సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. రాబోయేతరంలో ఉద్యోగాల కల్పన - భవిష్యత్ ను మార్చే ఎనిమిది సాంకేతిక విప్లవాలను గుర్తించామని వాటిలో కీలకమైన డాటా అనలిటిక్స్ - ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన ముఖ్యమైన కేంద్రం హైదరాబాద్ లో కొలువుదీరనుందని తెలిపారు.
ఇదిలాఉండగా...మంత్రి కేటీఆర్ ఈ సదస్సు ద్వారా పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మూడురోజుల పాటు ఘనంగా జరిగిన వరల్డ్ ఐటీ కాంగ్రెస్ చివరి రోజైన బుధవారం తెలంగాణ ప్రభుత్వం రెండు కీలక ఒప్పందాలు చేసుకొన్నది. విప్రో సౌందర్య ఉత్పత్తుల తయారీ యూనిట్ ఏర్పాటు ఒప్పందంతోపాటు తైవాన్ లోని తయువాన్ రాష్ట్రంతో సిస్టర్ స్టేట్ ఒప్పందం కుదుర్చుకొన్నది. బుధవారం విప్రో సంస్థ ముఖ్య ప్రణాళికాధికారి (సీఎస్ వో) రిషద్ ప్రేమ్ జీతో రాష్ట్ర ఐటీ - పరిశ్రమల శాఖ మంత్రి తారకరామారావు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తాము తెలంగాణలో ఒక తయారీ కేంద్రాన్ని నెలకొల్పనున్నట్లు మంత్రికి రిషద్ ప్రేమ్ జీ తెలిపారు. విప్రో వినియోగదారుల సంరక్షణ ఉత్పత్తుల విభాగం ఆధ్వర్యంలో సబ్బులు - ఇతర సౌందర్య ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని మహేశ్వరం మండలంలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇందుకు కోసం విప్రో సంస్థ దాదాపు రూ. 220 కోట్లను పెట్టుబడి పెట్టనున్నది. 40 ఎకరాల్లో నిర్మించనున్న ఈ తయారీ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 300 మందికి - పరోక్షంగా 200 మందికి ఉపాధి కల్పించనున్నారు. ఇప్పటికే ఇతర విభాగాల్లో తెలంగాణలో పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్న విప్రో సంస్థ నూతనంగా ఈ తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినందుకు మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటికే అనేక మెగా ప్రాజెక్టులకు అనుమతులిచ్చామని, ఇప్పుడు మరో మెగాప్రాజెక్టు రావడం రాష్ట్రంలో పెట్టుబడుల అనుకూల వాతావరణానికి అద్దం పడుతున్నదని తెలిపారు. దీంతోపాటు తెలంగాణలో ఉన్న పలు ఇతర పెట్టుబడి అవకాశాలను మంత్రి కేటీఆర్.. ఈ సందర్భంగా రిషద్ ప్రేమ్‌జీకి వివరించారు. ద్వితీయ శ్రేణి నగరాల్లోకి ఐటీ పరిశ్రమను తీసుకుపోయేందుకు ప్రయత్నం చేస్తున్నామని, ఇందుకోసం ఇప్పటికే పలు జిల్లాల్లో ఐటీ టవర్లు నిర్మిస్తున్నామని, టాస్క్ ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని రిషద్‌కు తెలిపారు. వరంగల్ పట్టణంలో సైయెంట్ తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నదని, తాజాగా టెక్ మహీంద్రా క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందని తెలిపిన మంత్రి కేటీఆర్.. విప్రో కంపెనీని వరంగల్ కు ఆహ్వానించారు. టెక్నాలజీ - ఇన్నోవేషన్ రంగంలో దేశంలోనే తెలంగాణ ముందువరుసలో ఉన్నదని రిషద్‌కు తెలిపారు. టీహబ్ - టీ వర్క్స్ వంటి కార్యక్రమాలపై ఈ సమావేశంలో రిషద్ ప్రేమ్ జీకి వివరించారు. త్వరలో ఏర్పాటు చేయనున్న మహిళా ఇంక్యుబేటర్ వి హబ్ తో విప్రో భాగస్వామ్యానికి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.