మోడీ మోడ‌ల్ ఔట్‌ డేటేడ్ - కేటీఆర్‌!

Update: 2018-04-08 06:47 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు - రాష్ట్ర పురపాలక - పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మ‌రోమారు బీజేపీని కెలికారు. త‌న తండ్రి కేసీఆర్ ప‌రిపాల‌న తీరును మెచ్చుకుంటూ బీజేపీ ర‌థసార‌థి - ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఏలుబ‌డిని ఎద్దేవా చేశారు. బీజేపీ నేత‌లు త‌ర‌చుగా `మోడీ మాడ‌ల్ అభివృద్ధి` ముగిసి పోయిన అధ్యాయం అని పేర్కొంటూ...త‌మ నాయ‌కుడు కేసీఆర్ థియ‌రీనే రాబోయే కాలంలో అంతా ఫాలో అవుతుంటార‌ని పేర్కొన్నారు. హైదరాబాద్‌ నాచారంలోని సింగం చెరువుతండాలో నిర్మించిన 176 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను మంత్రి నాయిని నర్సింహారెడ్డి - మేయర్‌ బొంతు రామ్మోహన్‌ - ఎంపీ మల్లారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. మేయర్‌ అధ్యక్షతన జరిగిన సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ... ఈ వ్యాఖ్య‌లు చేశారు.

అధికార - ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలని చూడకుండా పార్టీలకతీతంగా అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తున్నామని, అభివృద్ధి-సంక్షేమం ఎజెండాలుగా త‌మ పాల‌న సాగుతుంద‌ని మంత్రి కేటీఆర్ వివ‌రించారు.  పేదవాడి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే డబుల్‌ బెడ్‌ రూమ్ ఇళ్ల‌ను కట్టించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 'ఇల్లు కట్టిచూడు - పెళ్లి చేసి చూడు' అని పెద్దలు అంటుంటారని - ఈ రెండింటిలో ఏది చేయాలన్నా కష్టంగా మారిందన్నారు. టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం ఇల్లు కట్టించడంతో పాటు పెండ్లి కోసం కల్యాణలక్ష్మి - షాదీముబారక్‌ పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. `గుజరాత్‌ నమూనాను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని మోడీ ప్రధానమంత్రి అయ్యాడు. కానీ గుజరాత్‌ నమూనాకు కాలం చెల్లింది. వచ్చే ఏడాదిలో దేశంలో తెలంగాణ నమూనానే అమలు చేస్తారు. ఈ విషయాన్ని అహంకారంతో కాదు.. ఆత్మవిశ్వాసంతో చెబుతున్నా' అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

ఇంటింటికి తాగు నీరందించేందుకు మిషన్‌ భగీరథ, రైతులకు సాగునీరందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు, పేదల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా నిర్మిస్తున్న డబుల్‌ ఇండ్ల కోసం హడ్కో ద్వారా రుణం తీసుకుంటే అప్పా? తప్పా? పెట్టుబడినా? ప్రజలే నిర్ణయిస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో టీఎస్‌-ఐపాస్‌ లో భాగంగా 6,200 యూనిట్లకు అనుమతులిచ్చామని, వీటిలో 50 శాతానికి పైగా పరిశ్రమలు ప్రారంభమయ్యాయని, రూ.1.24 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టారని, వీటిద్వారా 3.30 లక్షల మంది ఉపాధి లభించిందని వివరించారు. ఆరు నెలల్లో ఉప్పల్‌ లో శిల్పారామం నిర్మించి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
Tags:    

Similar News