కొత్త కులం సృష్టిస్తున్నామంటున్న కేటీఆర్‌

Update: 2018-04-14 18:13 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త‌న‌యుడు మంత్రి కేటీఆర్ మాట‌కారి త‌నం గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేదు. సంద‌ర్భం ఏదైనా త‌న చాక‌చ‌క్యంతో కేటీఆర్ ఆహుతుల‌ను ఆక‌ట్టుకునేలా ప్ర‌సంగించ‌గ‌ల‌రు. అలాంటి ప్ర‌సంగాల‌తోనే గ‌త కొద్దికాలంగా ఆయ‌న మాస్ లీడ‌ర్‌గా ఎదుగుతున్నారు. అలాంటి కేసీఆర్‌ తాజాగా ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌సంగం ఒక‌టి చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో రవీంద్రభారతిలో జరిగిన టీప్రైడ్ అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కులం అనే భావ‌నకు కొత్త సూత్రీక‌ర‌ణ చేశారు.

ఎస్సీలకు తెలంగాణలో దక్కినట్లుగా ప్రోత్సాహం దేశంలో మరెక్కడా దక్కడం లేదని కేటీఆర్ అన్నారు. శిక్షణ ఇచ్చి దళిత - గిరిజన గుత్తేదారులను ప్రోత్సహిస్తున్నామన్నారు. దళితులకు బిజినెస్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. సూక్ష్మ - చిన్న పరిశ్రమలు ఎన్‌ పీఏ బారిన పడకుండా పరిష్కారం చూపిస్తామన్నారు. రూ. 50 కోట్ల కార్పస్ ఫండ్‌ తో మూతపడే స్థితిలో ఉన్న కంపెనీలను ఆదుకుంటున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. `ద‌ళితుల అభివృద్ధి కోసం ఆచరణతో - త్రికరణ శుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వం తెలంగాణ. ఆచరణలో చేసి చూయించడమే అంబేడ్కర్‌ కు నిజమైన నివాళి. దళిత పారిశ్రామిక వేత్తలు - కాంట్రాక్టర్లను ప్రోత్సహిస్తున్నం. పారిశ్రామిక హెల్త్ క్లీనిక్ దేశంలో ఎక్కడా లేదు. ఇండస్ట్రియల్ హెల్త్ క్లీనిక్ ద్వారా పరిశ్రమలను పునరుద్దరిస్తున్నాం. ఒక ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్నది. ఉన్నవారు, లేని వారు తప్ప భవిష్యత్తులో మరో కులం ఉండదు` అంటూ కొత్త విశ్లేష‌ణ‌ను కేటీఆర్ చేశారు.

బోధించు - సమీకరించు - పోరాడు.. నినాదంతో ఉద్యమంతో ముందుకు వెళ్లి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించామ‌ని కేటీఆర్ వివ‌రించారు. తెలంగాణలోని సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచాయని ఆయ‌న పేర్కొన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ ముందంజలో ఉందని, మూడున్నరేళ్ల‌లో గొప్ప పాలన అందించడం సీఎం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనమ‌ని కేటీఆర్ ఈ సంద‌ర్భంగా తెలిపారు.

Tags:    

Similar News