అంత జలుబు ఉన్నప్పుడు ఓపెనింగ్ లు అవసరమా కేటీఆర్?

Update: 2020-05-12 03:48 GMT
ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో కర్రలతో.. కత్తులతో బెదిరించాల్సిన అవసరం లేదు. జస్ట్.. అదే పనిగా ముక్కు చీదుతూ.. దగ్గుతూ.. తమ్ముతుంటే చాలు.. ఎంతటోడైనా సరే జడిసిపోవాల్సిందే. ప్రపంచమంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్న మాయదారి రోగంలో జలుబు.. దగ్గు చాలా కీలకం. ఒకవేళ అది మామూలు జలుబు అయినా.. ఏ పుట్టలో ఏ పాము ఉందోనన్నట్లుగా.. ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.  ఇలాంటివేళలో.. బాధ్యతతో వ్యవహరించాల్సిన వారు.. తమ ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా చేస్తున్న పనుల్ని పలువురు తప్పు పడుతున్నారు.

మంత్రి కేటీఆర్ తీవ్రమైన జలుబు.. తుమ్ములతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉంటే.. ఇల్లును విడవకుండా.. వీలైనంత తక్కువమందిని కలవటం మంచిది. కానీ.. అదేమీ పట్టించుకోకుండా పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ తీరును పలువురు తప్పు పడుతున్నారు.  తాజాగా ఆయన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలోని టెక్స్ టైల్స్ పార్కులో పలు పనుల్ని ప్రారంభించారు.

ఆ సమయంలో ఆయన జలుబుతో బాధ పడటంతో పాటు.. పలుమార్లు తుమ్మటం కనిపించింది. చేతిలో ఎప్పుడూ తువ్వాలు పట్టుకొని తిరగే అలవాటు లేని కేటీఆర్.. అందుకు భిన్నంగా గులాబీ తువ్వాలు పట్టుకొని తిరిగారు. ముఖానికి మాస్కు ఉన్నా.. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో అందరూ అప్రమత్తంగా ఉంటున్న పరిస్థితి. అంత జలుబుతో ఇబ్బంది పడుతున్నప్పుడు.. కార్యక్రమాల్లో పాల్గొనటం ఎందుకన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

నాలుగు రోజుల పాటు డెవలప్ మెంట్ పనుల్లో పాల్గొనకుంటే ఏమైనా నష్టం వాటిల్లుతుందా? అన్న ప్రశ్నల్ని పలువురు సంధిస్తున్నారు. నలుగురికి చెప్పాల్సిన స్థానంలో ఉన్న మంత్రి కేటీఆర్.. తన ఆరోగ్యం గురించి పెద్దగా పట్టనట్లుగా వ్యవహరించటం సరికాదంటున్నారు. ఒకవేళ అనుకోనిది ఏదైనా జరిగితే.. ప్రమాదం తీవ్రత ఎంతన్న విషయాన్ని మంత్రి కేటీఆర్ ఆలోచిస్తున్నారా? అంటూ ఆవేదన వ్యక్తం చేసే వారు లేకపోలేదు.
Tags:    

Similar News