లోకేష్‌ పాదయాత్రను అడ్డుకుంటాం: వైసీపీ మంత్రి హాట్‌ కామెంట్స్‌!

Update: 2022-12-29 12:25 GMT
ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. 175కి 175 సీట్లు సాధిస్తామని ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌ చెబుతున్నారు. మరోవైపు పులివెందులలో కూడా జగన్‌ గెలవడని.. వైసీపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని టీడీపీ, జనసేన ధీటుగా బదులిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. జనవరి 27 నుంచి 400 రోజులపాటు 4000 కిలోమీటర్ల మేర లోకేష్‌ పాదయాత్ర చేయనున్నారు. ఈ పాదయాత్రకు యువగళం అని పేరు కూడా పెట్టారు. ఇందుకు సంబంధించిన ప్రచార చిత్రాలను కూడా టీడీపీ నేతలు విడుదల చేశారు.

కాగా నారా లోకేష్‌ పాదయాత్రను అడ్డుకుంటామని ఏపీ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి పల్లెలో నారా లోకేష్‌ ను అడ్డుకుంటామన్నారు. టీడీపీ ఎస్సీలకు చేసిన మేలు ఏంటో చెప్పాలని ఆయనను నిలదీస్తామని మేరుగు నాగార్జున హెచ్చరించడం గమనార్హం. అంతవరకు ఆయన పాదయాత్రను అనుమతించబోమని మేరుగు నాగార్జున స్పష్టం చేశారు.

ఇప్పుడు మేరుగు నాగార్జున కామెంట్స్‌ వైరలవుతున్నాయి. ఈయన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

చంద్రబాబు రోడ్‌షోలకు భారీగా ప్రజలు తరలి వస్తుండటంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు కలవరపడుతున్నారని అంటున్నారు. అనుమతుల పేరుతో రోడ్‌ షోలను అడ్డుకునేందుకు కందుకూరు ఘటనను క్యాష్‌ చేసుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలోనే నారా లోకేష్‌ పాదయాత్రను అడ్డుకోవడానికి జగన్‌ ప్రభుత్వం ప్రత్యేక గైడ్‌ లెన్స్‌ తెచ్చే యోచనలో ఉందని టాక్‌ నడుస్తోంది. లోకేష్‌ పాదయాత్రను ప్రజలు విశ్వసించరని ఒకవైపు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు లోకేష్‌ పాదయాత్రను అడ్డుకుంటామని చెబుతుండటం వైసీపీ నేతలు ఆ పాదయాత్రతో ఎంత భయపడుతున్నారో తెలుస్తోందని టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.

ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌ లో పాదయాత్రలు చేసినవారంతా ముఖ్యమంత్రులు అయ్యారు. ఈ నేపథ్యంలో ఓవైపు లోకేష్‌ , మరోవైపు చంద్రబాబు సుడిగాలి పర్యటనలు చేస్తే తమకు ఇబ్బందికరమేనని వైసీపీ భావిస్తున్నట్టు సమాచారం. అందుకే నారా లోకేష్‌ ను పాదయాత్రను అడ్డుకుంటామని మేరుగు నాగార్జున ప్రకటించారని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News