మంత్రి'వర్గ విభేదాలు'

Update: 2015-07-23 07:06 GMT
    రాజమండ్రిలో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం మంత్రుల మధ్య మంటను బయటపెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన అస్త్రాలను దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు మీద ఎక్కుపెడితే... పలు వురు మంత్రులు మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ మీద విమర్శనాస్త్రాలతో దాడికి దిగారు. అయితే.. నేరుగా ఆయన్ను లక్ష్యం చేసుకునేందుకు ఎందుకో వెనుకాడారు. కానీ... మరికొందరు మంత్రుల్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించేందుకే మాత్రం వెనుకాడలేదు. అదేసమయంలో ప్రభుత్వవిప్‌ చింతమనేని ప్రభాకర్‌ను వెనకేసుకు రావడంలో మంత్రులందరూ ఏక తాటిపై నిలబడ్డారు.

    పురపాలక మంత్రి నారాయణ పట్ల పెల్లుబుకు తున్న అంతర్గత అసమ్మతికి బుధవారం జరి గిన మంత్రివర్గ సమావేశం అద్దంపట్టింది.ఇటీవల నారాయణ కు ముఖ్యమంత్రి ఎనలేని ప్రాధాన్యతనిస్తున్నారు. నూతన రాజధాని నిర్మాణంలో ప్రతిఅంశాన్ని ఆయనతోనే చర్చిస్తున్నారు. రాజమండ్రి పుష్కరాల నిర్వహణలోనూ ఆయనే అంతా అన్నట్లుగా నడిపించారు. ఉభయగోదావరి జిల్లాలకు చెందిన మంత్రులకంటే కూడా పుష్కరాల్లో నారాయణ పెత్తనం అధికంగా కనిపించింది. వీటన్నింటిని ఇంతకాలం మౌనంగా భరించిన మంత్రులకు పురపాలక సమ్మె అస్త్రంలా కనిపించింది. సొంతశాఖ ను సరిదిద్దుకోలేని మంత్రి చీటికిమాటికి తమ శాఖలపై పెత్తనం చేస్తున్నారన్న ఉద్దేశాన్ని కొందరు మంత్రులు కనబరిచారు. పారిశుధ్య సిబ్బంది సమ్మె అంశం సమావేశంలో చర్చకు రాగానే దాదాపుగా మంత్రులంతా నారాయణ తీరుపై విమర్శలు కురిపించారు.

    మరోవైపు దేవాదాయ మంత్రి మాణిక్యాలరావుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయగా ఎవరూ ఆయనకు బాసటగా నిలవలేదు. బీజేపీకే చెందిన మంత్రి కామినేని శ్రీనివాసరావు కూడా నోరుమెదపలేదు. పైగా మీవల్లే అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ మంత్రి మాణిక్యాలరావును అందరిముందు చంద్రబాబు మందలించడం బిజెపితో కొరవడ్డ సఖ్యతకు అద్దంపడుతోంది. పుష్కర దుర్ఘటనపైనా మంత్రులు ఒకరిపై ఒకరు తప్పు నెట్టుకునే ప్రయత్నం చేశారు... అందరూ కూడబలుక్కుని చంద్రబాబును సమర్థించారు కానీ ఇతర మంత్రుల్ని తప్పు బట్టేందుకు ప్రయత్నించారు. మొత్తానికి మంత్రివర్గం సమావేశం  మంత్రుల మధ్య పొరపొచ్చాలను స్పష్టంగా బయటపెట్టాయి.

Tags:    

Similar News