మంత్రులు...ఎమ్మెల్యేల పిల్లలు ఎక్కడ చదువుతున్నారు బొత్స గారు...?

Update: 2022-07-26 15:36 GMT
మాట్లాడితే చాలు టీచర్ల మీద విద్యా శాఖ మంత్రి గారు అదే పనిగా  విమర్శలు చేస్తున్నారు అని అంటున్నారు. టీచర్లు గతం కంటే కూడా ఇపుడు చాలా ఎక్కువ‌ బాధ్యతగానే పనిచేస్తున్నారు. వారి మీద కూడా అనేక భారాలు కూడా ఏలిన వారు  పెడుతున్నారు. ఇక ఈ నేపధ్యంలో డైరెక్ట్ గా టీచర్ల పిల్లల మీదనే విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటు వ్యాఖ్య్లు చేశారు. గురువులూ మీ పాఠాలు మాకు చెప్పవద్దు అంటూ గట్టిగా హెచ్చరించిన మినిస్టర్ సాబ్ మరో అడుగు ముందుకేసి మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అంటూ వారి వ్యక్తిగత విషయాలను కూడా టచ్ చేశారు.

దీంతో ఉపాధ్యాయ సంఘాల నేతలతో పాటు ఉపాధ్యాయులు కూడా పెద్ద ఎత్తున  మండుతున్నారు. ఇదేమి ప్రశ్న అని కూడా వారు ఫైర్ అవుతున్నారు. తామేమీ హామీలు ఇచ్చి అధికారాలు అందలాలూ అందుకోలేదని ఈ దేశంలో పౌరులుగా తమకు ఉన్న హక్కులనే వాడుకుంటున్నామని అంటున్నారు. అయినా అందరు ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారని అనుకుంటే పొరపాటు అని కూడా వారు చెబుతున్నారు.

అదే సమయంలో మేధావులు చదువరుల నుంచి మరికొన్ని ప్రశ్నలు మంత్రి బొత్స గారికి నేరుగా వస్తున్నాయి. టీచర్లు సరే వారి పిల్లలను సర్కార్ బడులలో చదివించలేదని అంటున్నారు. కానీ మీ మంత్రులు, ఎమ్మెల్యేల పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అని నిలదీస్తున్నారు. ఈ మాట అంటే మీకు మంటగా ఉన్నా యధార్ధం చెప్పగలరా సార్ అని ప్రశ్నిస్తున్నారు.

చాలా మంది ప్రజా ప్ర‌తినిధుల బిడ్డలు కూడా ప్రైవేట్ కే జై కొడుతున్నారు. అలా వారూ వీరూ అంతా కలసే కదా సర్కార్ వారి బడులను దవాఖానాలను ఏమీ కాకుండా అచేతనం చేశారు అన్న విమర్శలు వస్తున్నాయి. ముందు జనాలను ఏలే ప్రభువులు ఆదర్శంగా ఉంటే మిగిలిన వారికి చెప్పినా ఒక అర్ధం అందమని కూడా సెటైర్లు గట్టిగా పడుతున్నాయి.

ప్రభుత్వం సైతం అమ్మ ఒడిని ప్రైవేట్ పాఠశాలలకు వర్తింపచేయడం ద్వారా ఏమి సందేశం ఇస్తోందని కూడా జనాల నుంచి సూటిగానే ప్రశ్నలు వస్తున్నాయి. అంటే ప్రైవేట్ లో చదువుకున్నా అభ్యంతరం లేదనే కదా. మరి అలాంటపుడు కేవలం టీచర్లనే టార్గెట్ చేస్తూ మంత్రి గారు విమర్శలు చేయడంతో సహేతుకత ఎంతవరకూ ఉంది అని కూడా విమర్శలు వస్తున్నాయి.

ఇక టీచర్లు అడిగింది తమ బిడ్డల గురించి కాదు అని మంత్రి గారే అంటున్నారు. ఆ బడుగుల బిడ్డల కోసమే ప్రభుత్వం పనిచేస్తోంది అన్నపుడు వారికి పాఠశాల  విలీనం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను కూడా గుర్తించాలి కదా అన్న మాట వస్తోంది. మొత్తానికి చూస్తే బొత్స ఒక మాట అనడం కాదు కానీ ఇపుడు దాని మీద అనేకానేక ప్రశ్నలు వచ్చేశాయి.
Tags:    

Similar News