లాక్ డౌన్ లోనూ మిస్సింగ్.. ఎందుకంటారు?

Update: 2020-04-05 06:39 GMT
కరోనాను కట్టడి చేసే క్రమంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించటమే కాదు.. ఇంట్లో నుంచి బయటకు వెళ్లేందుకు వీలు లేకుండా ఆంక్షలు.. అడుగడుగునా పోలీసుల పహరా.. ప్రయాణాలకు వీల్లేని రీతిలో పరిస్థితులు. మొత్తంగా ఇంట్లో నుంచి బయటకు రావటం అంత సులువైన పరిస్థితులు లేవు.  దీనికి తోడు.. ఇంట్లోని వారంతా కలిసి ఉంటున్న వేళ.. అనుక్షణం ఒకరి గురించి ఒకరు ఆరా తీసుకోవటం ఎక్కువైంది.

ఎంతో అవసరమైతే తప్పించి బయటకు రాకుండా ఉండటం.. వచ్చినా.. ఇంటికి తిరిగి వెళ్లే వరకూ ఇంట్లో వాళ్లు ఫోన్ల మీద ఫోన్లు చేసే పరిస్థితి. ఇలాంటివేళ.. మిస్సింగ్ కేసులు చోటు చేసుకోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పాలి. ఆసక్తికరమైన విషయంలో ఏమంటే.. తెలంగాణ వ్యాప్తంగా మార్చి 22 నుంచి ఏప్రిల్ 2 వరకూ అంటే గడిచిన పన్నెండు రోజుల్లో మిస్సింగ్ కేసులు 356 నమోదు కావటం గమనార్హం. అంటే.. రోజుకు రాష్ట్రం మొత్తమ్మీదా ముప్ఫై మంది మిస్ అవుతున్నారు.

ఇంటి నుంచి బయటకు వెళితే.. ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం లేని వేళలోనూ మిస్సింగ్ కేసులు ఇంతలా ఉండటం ఏమిటన్నది ప్రశ్నగా మారింది. అయితే.. మిస్ అయిన వారు.. వారి బ్యాక్ గ్రౌండ్ చెక్ చేసినప్పుడు ఆసక్తికరమైన అంశాలు తెర మీదకు వచ్చాయి. ప్రేమ వ్యవహారాలతో పాటు.. అనైతిక బంధాలు.. పిల్లల నిర్లక్ష్యాన్ని తట్టుకోలేని పెద్ద వయస్కులు.. మద్యం దొరకని నేపథ్యంలో మానసిక స్థిరత్వం మిస్ అయిన వారే ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా.. ఆంక్షల వేళలోనూ మిస్ కావటం విశేషంగా చెప్పకతప్పదు.


Tags:    

Similar News