సీఎం కావాలంటే చాలా లెక్క‌లుంటాయి రాజ‌గోపాలా?

Update: 2019-06-25 05:06 GMT
కాన్ఫిడెన్స్ ఉండాలి. కానీ.. అదేదీ మితిమీరిన‌ట్లుగా ఉండ‌కూడ‌దు. తాజాగా కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డికి చెందిన ఒక ఆడియో టేపు బ‌య‌ట‌కు వ‌చ్చి సంచ‌ల‌నం సృష్టిస్తోంది. కాంగ్రెస్ కు చెందిన ఒక కార్య‌క‌ర్త‌తో మాట్లాడే క్ర‌మంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు కొత్త దుమారాన్ని రేపుతున్నాయి. పార్టీ మార‌కుండానే కాబోయే ముఖ్య‌మంత్రి తానేన‌న్న‌ట్లుగా ఉన్న రాజ‌గోపాల్ వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌లనంగా మారాయి.

మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న రాజ‌గోపాల్ కు చెందిన ఆడియో టేపుపై పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి సోద‌రుడైన రాజ‌గోపాల్ రెడ్డి.. ఈ నెల 28న ఢిల్లీలో బీజేపీ పెద్ద‌ల స‌మ‌క్షంలో పార్టీలో చేర‌నున్న‌ట్లుగా ప్ర‌చారం సాగుతోంది.

ఇలాంటివేళ ఆయ‌న‌కు చెందిన ఆడియో బ‌య‌ట‌కు వ‌చ్చి క‌ల‌క‌లంగా మారింది. స‌ద‌రు ఆడియోలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు పెను దుమారాన్ని రేప‌ట‌మే కాదు.. రాజ‌గోపాల్ రెడ్డి కాన్ఫిడెన్స్ ఈ స్థాయిలో ఉందా? అన్న ఆశ్చ‌ర్యం వ్య‌క్త‌మువుతోంది. రాహుల్ గాంధీనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన‌ట్లుగా స‌ద‌రు ఆడియోలో ఉంది.

వాస్త‌వానికి రాహుల్ రాజీనామా చేసింది కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్ష ప‌ద‌వికి మాత్ర‌మే. కానీ.. రాజ‌గోపాల్ రెడ్డి అందుకు భిన్నంగా ఉండ‌టం ఒక ఎత్తు అయితే.. తాను బీజేపీలో చేరిన త‌ర్వాత తెలంగాణ‌లో ఆ పార్టీ ప‌వ‌ర్ లోకి వ‌స్తే తానే ముఖ్య‌మంత్రిని అని చెప్పుకోవ‌టం షాకింగ్ గా మారింద‌ని చెప్పాలి. ఎందుకంటే.. ఒక రాష్ట్రంలో బీజేపీ ప‌వ‌ర్ లోకి వ‌స్తే.. సీఎం ఎంపిక విష‌యంలో చాలా లెక్క‌లు ఉంటాయి.

అన్నింటికి మించి.. ఏ రాష్ట్రంలో బీజేపీ సీఎం అయినా అత‌డి బ్యాక్ గ్రౌండ్ లో సంఘ్ మూలాలు ఉండాలి. అది క‌నీస అర్హ‌త‌. అలాంటిదేమీ లేని రాజ‌గోపాల్ రెడ్డి లాంటి వారికి ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ద‌క్క‌టం సాధ్య‌మే కాదు. ఈ చిన్న విష‌యాన్ని ప‌ట్టించుకోకుండా ఏదేదో లెక్క‌లు వేసుకున్న‌ట్లుగా ఆడియోను వింటే అర్థం కాక మాన‌దు.

బీజేపీలో చేరాల‌న్న జోష్ లో ఉన్న రాజ‌గోపాల్.. తొలుత ఆ పార్టీ క‌ల్చ‌ర్ ఎలా ఉంటుంద‌న్న విష‌యం మీద కాస్త క్లారిటీ తెచ్చుకుంటే మంచిది. లేని ప‌క్షంలో అసంతృప్తితో ర‌గిలిపోవ‌టానికి మిన‌హా మ‌రో మార్గం ఉండ‌ద‌న్న విష‌యాన్ని ఆయ‌న గుర్తిస్తే మంచిది.


Full View

Tags:    

Similar News