వైసీపీ ధర్నా అట్టర్ ఫ్లాప్!
వైసీపీ ఓటమి తరువాత అన్ని శక్తులూ కూడ దీసుకుని తొలిసారి వీధులలోకి వచ్చింది. ప్రజా సమస్యలు అంటూ రోడ్డు మీదకు వచ్చి ఆందోళనలు చేసింది.
వైసీపీ ఓటమి తరువాత అన్ని శక్తులూ కూడ దీసుకుని తొలిసారి వీధులలోకి వచ్చింది. ప్రజా సమస్యలు అంటూ రోడ్డు మీదకు వచ్చి ఆందోళనలు చేసింది. అయితే వైసీపీ ధర్నా హిట్టా ఫట్టా అంటే అట్టర్ ఫ్లాప్ అని టాక్ అయితే వస్తోంది. ఎందుకూ అంటే జనాలు లేని జనాలతో సంబంధం లేని విధంగా మొక్కుబడిగా కొద్ది మంది పార్టీ నేతలతో అలా సాగిపోయిన ఒక సాదా సీదా కార్యక్రమంగా ఇది మిగిలింది అని అంటున్నారు.
ఆరు నెలలు సాధన చేసి మరీ ఈ విధంగా జనంలోకి వస్తే ఎలా అన్న కామెంట్స్ పడుతున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం బలంగా ఉంది. మూడు పార్టీలు ఐక్యంగా ముందుకు పోతున్నాయి. ఎటు చూసినా కూటమి ప్రభుత్వ విధానాలూ నినాదాలే కనిపిస్తున్న వేళ ప్రజలు ఇంకా ఆశల ఊసులతోనే కాలక్షేపం చేస్తున్న వేళ రాంగ్ టైం లో వైసీపీ ఈ ఆందోళలనలకు పిలుపు ఇచ్చిందా అన్న చర్చ ఉండనే ఉంది.
అయిదేళ్ళ పాటు కూటమి ప్రభుత్వానికి సమయం ఇస్తే వైసీపీ మరిన్నాళ్ళు ఆగలేదా అని సొంత పార్టీలోనే విమర్శలు నేతలు చేస్తున్న నేపధ్యంలో ఈ ధర్నా అయితే జనాల్లోకి వెళ్ళలేకపోయింది అని అంటున్నారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేపట్టిన ఈ ధర్నాకు జనాల నుంచి పెద్దగా రియాక్షన్ అయితే రాలేదని అంటున్నారు.
సాధారణంగా జనం మనసెరిగి రాజకీయ నేతలు ఆందోళలను చేపడతారు. ఎందుకంటే వారి చేయి కలిస్తేనే తప్ప గట్టిగా చప్పట్లు వినిపించవు లేకపోతే ఒంటి చేత్తో చప్పట్లు కొట్టుకోవడం ద్వారా ఆయాసమే మిగులుతుంది. అయితే వైసీపీ అటు అసెంబ్లీకి వెళ్ళక ఇటు పార్టీలో కూడా నిండా నైరాశ్యం కమ్ముకున్న నేపధ్యంలో ఏ ఒక్కరూ బయటకు రాని దుస్థితి ఉంది.
దానిని చేదించడానికి అన్నట్లుగా అధినాయకత్వం ధర్నాలకు పిలుపు ఇచ్చింది. అంటే పార్టీ జనాలను తట్టి లేపేందుకు ఈ ఆందోళనలు అన్న మాట. ఎంత మంది పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు ఎవరు తెర వెనకన ఉన్నారు అన్నది తేలిపోవడానికి కూడా పార్టీ హైకమాండ్ అనుసరించిన మార్గం ఇదని అంటున్నారు.
అయితే పార్టీ వరకూ ఇది ఓకేగా ఉన్నా జనాలతో ముడిపడి ఉన్న ఆందోళనలకు వారి ప్రమేయం కూడా అవసరమే కదా అన్న మాట వినిపిస్తోంది. జనం మూడ్ ఎలా ఉంది, వారు నిజంగా ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో విముఖంగా ఉన్నారా లేరా అన్నది తెలుసుకునే ప్రయత్నం ఏదైనా జరిగిందా అన్నది కూడా తెలియదు. వైసీపీ నేతలను జెండాలు పట్టి జనంలోకి వెళ్లమని పార్టీ అయితే ఆదేశాలు ఇచ్చింది.
దాంతో మొక్కుబడిగానే నేతలు కూడా కదిలారు. దాంతోనే జనాలలో అయితే స్పందన లేదని అంటున్నారు. ప్రజలలో స్పందన ఉంటేనే ఆందోళనలు విజయవంతం అవుతాయి. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం మీద ప్రజలలో ఇంకా ఆశలు అలాగే ఉన్నాయని అంటున్నారు. వైసీపీ అధినాయకత్వం భావించినట్లుగా ఆరు నెలలలోనే వెల్లువలా వ్యతిరేక్త అయితే లేదని అంటున్నారు.
సూపర్ సిక్స్ పేరిట ఇచ్చిన ఆరు హామీలలో రెండింటిని ప్రభుత్వం ఇప్పటికి నెరవేర్చింది. మిగిలిన హామీలను కూడా తీర్చే పనిలో ఉన్నట్లుగా కూటమి పెద్దలు చెబుతూ వస్తున్నారు. దాంతో వేచి చూసే ధోరణిలో ప్రజలు ఉన్నారు. ఈ సమయంలో ధర్నాలు అంటూ జనంలోకి వచ్చి వైసీపీ తనకు తానే పరీక్ష పెట్టుకుందా అన్నది కూడా ఒక ప్రశ్నగా ఉంది. ఏది ఏమైనా జనాలు లేని ఆందోళనలు మొక్కుబడి ధర్నాలు వైసీపీ గ్రాఫ్ ని ఇసుమంతైనా పెంచవు సరికదా ఇంకా దించుతాయని అంటున్నారు.