నయీం ఆయన్ను సీఎంగా చూడాలనుకున్నాడు

Update: 2016-09-16 12:39 GMT
ఆర్.కృష్ణయ్య... తెలుగు రాష్ట్రాల్లోని నేతలు - పోరాటశీలుల్లో భిన్నమైన వ్యక్తిత్వం. రాజకీయంగా ఆయనపై ఆరోపణలు ఉంటే ఉండొచ్చు కానీ ఇతర ఆరోపణలేమీ లేని వ్యక్తి. బీసీల కోసం ఏమైనా చేస్తారని పేరు. సింపుల్ గా ఉండే లైఫ్ స్టైల్. అనుకోని అవకాశంతో ఎమ్మెల్యే అయినా బీసీల కోసం ఆ పదవినిచ్చిన పార్టీతోనూ దూరంగా ఉన్న నేత. అలాంటి ఆర్.కృష్ణయ్యపై తీవ్రమైన ఆరోపణలు వస్తుండడంతో బలహీనవర్గాల ప్రజల్లో అయోమయం ఏర్పడింది. ఎన్ కౌంటర్ కు గురయిన గ్యాంగ్ స్టర్ నయీంతో ఆర్.కృష్ణయ్యకు క్లోజ్ రిలేషన్సు ఉన్నాయని... ఓ హత్య విషయంలో నయీం సాయం తీసుకున్నారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. దీంతో ఆర్.కృష్ణయ్యను అభిమానించేవారంతా ఏది నిజమో.. నమ్మాలో వద్దో తెలియక అయోమయంలో ఉన్నారు.

అయితే... నయీం వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అందరి మాదిరిగానే కృష్ణయ్య కూడా బయటకొచ్చి అసలు విషయం చెప్పారు. మిగతావారిలా నయీం ఎవరో తనకు తెలియదని ఆయన బుకాయించలేదు. నయీంతో తనకు మంచి పరిచయాలు ఉన్నాయని ఆయన నిర్భయంగా చెప్పారు. ఆ సంబంధాలు ఎలాంటివో కూడా చెప్పుకొచ్చారు. ఓ టీవీ ఛానల్ తో మాట్లాడిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య... తనపై వస్తున్న ఆరోపణలకు సమాధానంగా పలు విషయాలు వెల్లడించారు.

రాడికల్ ఉద్యమ సమయంలో నయీమ్ తనతో కలిసి పనిచేశాడని - తనను సీఎంగా చూడాలన్నది నయీమ్ కలని  ఆర్.కృష్ణయ్య వెల్లడించారు.  చంద్రబాబు తన పేరును సీఎం అభ్యర్థిగా ప్రకటించిన తరవాత - నయీమ్ సంతోషించాడని అన్నారు. అయితే.... తన గెలుపు - ప్రచారం వెనుక ఆయన హస్తం లేదని చెప్పిన కృష్ణయ్య - 1986 నుంచి నయీమ్ తనకు తెలుసునని - పట్లోళ్ల గోవర్థన్ రెడ్డి సైతం తనకు మంచి మిత్రుడేనని అన్నారు. పటోళ్లను నయీమే చంపిన విషయం తెలిసిందే.

కాగా నయీంతో తనకు ఆర్థిక సంబంధాలు కానీ... దందాల వ్యవహారాలు కానీ లేవని ఆయన స్పష్టం చేశారు. నయీమ్ రాసుకున్న డైరీని బయటపెట్టాలని డిమాండ్ చేసిన ఆయన - ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని అన్నారు. నయీమ్ తో ఆర్థిక వ్యవహారాల్లో తనకు లింకులుంటే ఏ శిక్షకైనా సిద్ధమేనని తెలిపారు. రాజకీయ దురుద్దేశాలతోనే తన పేరును ఇరికించాలని చూస్తున్నారని కృష్ణయ్య ఆరోపించారు. ఈ కేసులో ప్రత్యేక దర్యాఫ్తు బృందం తనకు నోటీసులు ఇస్తే వారి విచారణకు హాజరవుతానని తెలిపారు. అధికారపక్షానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు - ఎంపీలకు నయీమ్ తో దగ్గరి సంబంధాలున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం జరిపించే విచారణతో తనవంటి బడుగు నేతలే తప్ప పెద్ద తలలు బయటకు రావని అన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తితో లేదా సీబీఐ కేసును విచారించేలా ఆదేశాలివ్వాలని డిమాండ్ చేశారు.
Tags:    

Similar News