చిన్న ఇగోతో పార్టీకి, జ‌గ‌న్‌ కు చెడ్డ పేరు తెస్తున్నారుగా...

Update: 2019-08-01 09:36 GMT
అతి చిన్న వయసులో ఆంధ్రప్రదేశ్ రెండో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్. జగన్మోహన్ రెడ్డి  పాలనాపరంగా కేవలం రెండు నెలల్లోనే అనేక సంస్కరణలు తీసుకువచ్చి దేశవ్యాప్తంగా ఎంతో మంది రాజకీయ నేతల నుంచి ఔరా అనిపించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా రాజకీయాలు క‌లుషితం కావ‌డానికి కారణమైన ఫిరాయింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించని దేశ రాజకీయాలకే ఆదర్శంగా నిలిచారు. అవినీతి- అక్రమాల విషయంలో సొంత పార్టీ నేతలు ...ప్రతిపక్ష పార్టీల నేతలు అని తేడాలేకుండా వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. తన క్యాబినెట్ సహ‌చ‌రుల‌కు సైతం అవినీతి, దందాలను సహించన‌ని తొలి కేబినెట్ సమావేశంలోనే వార్నింగ్ ఇచ్చేశారు. తన ఆదేశాలు దాటుకొని ముందుకు వెళుతున్న ఐదుగురు మంత్రుల‌కు సైతం వార్నింగ్ ఇచ్చినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

జగన్ పాలనాపరంగా ఎక్కడ చిన్న రిమార్క్ రాకుండా ముందుకు వెళుతుంటే ఆ పార్టీ నేతలు మాత్రం ఇగోకు పోయి చిన్న చిన్న‌ విష‌యాల‌కు కూడా పంతానికి పోయి అటు పార్టీకి ఇటు ముఖ్యమంత్రి జగన్ కు చెడ్డ పేరు తెస్తున్నార‌న్నది వాస్తవం. గత ఐదేళ్ల టిడిపి ప్రభుత్వ పాలన కన్నా మన పాలన భిన్నంగా ఉండాలని... ఎక్కడా కక్షసాధింపులకు పాల్ప‌డ‌కూడదని జ‌గ‌న్‌ ఎమ్మెల్యేలకు చెబుతున్న ఎమ్మెల్యేలు మాత్రం ఆచరణలో జగన్ మాటలను పెడచెవిన పెడుతున్నారు. జగన్ ఎంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినా ముగ్గురు.. న‌లుగురు మంత్రులు కూడా తమ తీరు మార్చుకోలేదు.

తాజాగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల‌పై దురుసుగా ప్రవర్తించి ట్రాఫిక్ ఇన్‌ స్పెక్ట‌ర్‌ ను కాలితో తన్నిన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కుమారుడు వెంకట కృష్ణ ప్రసాద్ ను పోలీసులు రిమాండ్ కు తరలించిన సంగతి తెలిసిందే. ఇది చాలా చిన్న విషయం కృష్ణ ప్రసాద్ ఎమ్మెల్యే కొడుకును అన్న అహంతోనే పోలీసులపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు నానా రచ్చ చేశాడు. కృష్ణ‌ప్ర‌సాద్ కారు నిబంధనలను ఉల్లంఘించిన ముందుకు వెళుతుండగా కానిస్టేబుల్‌ కృష్ణ అడ్డుకుని వారించాడు. వెంట‌నే అత‌డు పోలీసుల‌తో వాగ్వివాదానికి దిగ‌డంతో పాటు నువ్వు అంటావా అని బండ‌బూతులు తిట్టాడు.

ఇంతలో ట్రాఫిక్‌ సర్కిల్‌ ఇన్‌ స్పెక్టర్‌ రాజగోపాల్‌ రెడ్డి అక్కడి చేరుకొని అతడిని వారించే ప్రయత్నం చేసినా కృష్ణ‌ప్ర‌సాద్‌ మరింత రెచ్చిపోయిన అతడు నన్నే స్టేషన్‌ కు రమ్మంటావా.. అంటూ ట్రాఫిక్ సీఐను పక్కకు నెట్టేసి, కాలుతో తన్నాడు. ట్రాఫిక్‌ ఇన్‌ స్పెక్టర్‌ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే తనయుడి పై ఐపీసీ సెక్షన్లు 332- 353- 506 కింద కేసు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని మంగళవారం రాత్రి 12వ ఏఎంఎం కోర్టు జడ్జి ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో వెంకట కృష్ణ ప్రసాద్‌ ను చర్లపల్లి జైలుకు తరలించారు. చివ‌ర‌కు ఎమ్మెల్యే భార్య విమ‌ల‌- కూతురు- కోడ‌లు- అల్లుడు కూడా ఆ త‌ర్వాత అక్క‌డ‌కు చేరుకుని నానా ర‌చ్చ చేశారు.

ఎమ్మెల్యే భార్య అయితే కేసీఆర్‌ తో చెప్పి నిన్ను స‌స్పెండ్ చేయిస్తాన‌ని వార్నింగ్ ఇచ్చారు. ఇక ఎమ్మెల్యే కుమార్తె సైతం పోలీసుల‌తో అన‌వ‌స‌ర‌పు వాగ్వివాదానికి దిగింది. ఈ వీడియోలు వైర‌ల్ కావ‌డంతో అది అటు పార్టీకి, ఎమ్మెల్యేకు పెద్ద మైన‌స్ అయ్యింది. ఈ విష‌యానికి జ‌గ‌న్‌ కు లింక్ లేక‌పోయినా.. జ‌గ‌న్ ఎక్క‌డ దొరుకుతాడా ? అని కాచుకుని ఉన్న విప‌క్షాలు ఈ సంఘ‌ట‌న‌కు జ‌గ‌న్‌ కు లింక్ పెట్టి రౌడీ రాజ్యం అంటూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. వీటిని సోష‌ల్ మీడియాలో బాగా స్ప్రెడ్ చేస్తున్నారు. ఇలాంటి నేత‌లు, వారి కుమారుల తీరు వ‌ల్ల జ‌గ‌న్‌ కు సంబంధం లేకుండానే పార్టీకి పెద్ద డ్యామేజ్ జ‌రుగుతోంది.
Tags:    

Similar News