టీ ఎమ్మెల్యే ఆంధ్రోళ్లను ఎటకారం చేశారా?

Update: 2016-12-26 14:46 GMT
ఏ ప్రాంతానికి చెందిన వారైనా.. హైదరాబాద్ లో ఉండేవారంతా హైదరాబాదీయులేనని అంత పెద్ద తెలంగాణ ఉద్యమ నేత.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ చెబితే.. జాతీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. విశాల దృక్ఫదంతో వ్యవహరించాల్సిన పార్టీనేతలు అందుకు భిన్నంగా మాట్లాడుతున్న తీరు చూసినప్పుడు ఆశ్చర్యంగా అనిపించటమే కాదు.. హైదరాబాద్ ను ఏం చేయాలని భావిస్తున్నారన్న సందేహం కలగక మానదు.

ఓపక్క విశ్వనగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దేందుకు అధికార టీఆర్ ఎస్ ప్రణాళికలు వేస్తుంటే.. అందుకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సంపత్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీసే ప్రమాదం ఉందన్న భావన వ్యక్తమవుతోంది. తానీ మధ్యన ఒక కంపెనీకి వెళ్లిన సందర్భంలో వాచ్ మన్ దగ్గర నుంచి ఉన్నత ఉద్యోగి వరకూ అందరూ ఆంధ్రాప్రాంతానికి చెందిన వారే ఉన్నారంటూ సంపత్ చేసిన వ్యాఖ్యలు సభలో కొత్త అగ్గి పుట్టించాయి.

కులాల పేర్ల ప్రస్తావన తీసుకొస్తూ.. గోదావరి జిల్లాల యాసను ఇమిటేట్ చేసిన సంపత్.. ‘‘ఈ మధ్యన ఒక కంపెనీకి వెళ్లాను. అక్కడ సెక్యూరిటీ గార్డు మొదలుకొని.. ఉన్నతోద్యోగి వరకూ అంతా ఆంధ్రావారే. సారూ.. లేరండీ.. అంటూ చెప్పారు. లోపలికి వెళ్లి వాకబు చేస్తే అక్కడ పని చేసే ఉద్యోగి ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారేనని.. మొత్తంగా పని చేసే వాళ్లంతా ఆంధ్రోళ్లే. మనకు భీమవరం రాజులు మిత్రులు ఉండొచ్చు. గుంటూరు చౌదరీలు మిత్రులు ఉండొచ్చు. కానీ.. ప్రతి కంపెనీలో ఆంధ్రా వ్యక్తులే కనిపిస్తుంటే.. తెలంగాణ యువకులు ఏమైపోవాలి?’’ అని ప్రశ్నించటం గమనార్హం.

ఇలాంటి మాటలే అమెరికాలో ట్రంప్ చెబితే..మనోళ్ల కడుపు కొడుతున్నాడంటూ ట్రంప్ మీద  మనమంతా ఆగ్రహం వ్యక్తం చేస్తాం. మరి.. ఒకేదేశానికి చెందిన ప్రజలు.. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఉపాధికి వస్తే.. ఈ తరహాలో మాట్లాడటం.. అది కూడా ఒక జాతీయ పార్టీకి చెందిన ఎమ్మెల్యే నోటి నుంచి రావటం దేనికి సంకేతం?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News