అటు విశ్వాసం.. ఇటు భాగ్యం...?

Update: 2022-04-01 03:30 GMT
మంత్రి వర్గ విస్తరణలో ఏపీకి  కొత్త గిరిజన మంత్రి ఎవరు అన్నదే చర్చ. మొత్తానికి మొత్తం గిరిజన ఎమ్మెల్యేలు అంతా వైసీపీలోనే ఉన్నారు. వారిలో ఉత్తరాంధ్రాలో అధిక శాతం ఉన్నారు. సహజంగా విస్తరణలో కూడా ఇటు వైపే మొగ్గు ఉంటుందని అంటున్నారు. ఇక ఉత్తరాంధ్రా జిల్లాలలో తొలి విడతలో చూసుకుంటే కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణికి పదవి దక్కింది. ఆమె ఏకంగా ఉప ఉప ముఖ్యమంత్రి హోదాను కూడా అందుకున్నారు.

ఇపుడు మలివిడతలో ఎవరికి లక్ దక్కేనూ అన్నదే మాటా మంతీ. అలా కనుక చూసుకుంటే సీనియర్ గా ఉంటూ జగన్ పట్ల విధేయత, విశ్వాసం చూపించే మహిళా మణి పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతికి మంత్రి పదవి దక్కుతుంది అని అంటున్నారు.

ఆమె 2014లో గెలిచారు, అప్పట్లో టీడీపీ నుంచి ఎన్ని ప్రలోభాలు వచ్చినా కూడా ఆమె వైసీపీని వీడకుండా తన విశ్వాసం చాటుకున్నారు. పాలకొండను వైసీపీకి కంచుకోటగా మార్చారు. ఇక ఆమె ఉన్నత విద్యావంతురాల్జు. ఎంఏ ఎకనామిక్స్ చేశారు. పార్టీకి అంకితభావంతో పనిచేస్తారని పేరుంది.

మరో వైపు చూస్తే ఆమెకు పోటీగా రేసులో అల్లూరి జిల్లా నుంచి పాడేరు ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మి ఉన్నారు. ఆమె పేరులోనే భాగ్యం ఉంది. ఆమెకు మంత్రి యోగం కూడా అలా లభించేనా అన్నది కూడా పార్టీలో చర్చగా ఉంది. భాగ్యలక్ష్మిది రాజకీయ కుటుంబం. తండ్రి కూడా ఎమ్మెల్యే చేశారు.

ఏజెన్సీలో వారికి మంచి పేరు ఉంది. ఆమె సైతం ఉన్నత విద్యావంతురాలు. ఎమ్మెస్సీ చదివారు. మహిళా సమస్యల మీద మరీ ముఖ్యంగా గిరిజన సమసల మీద మంచి అవగాహన ఉంది. ఏ విషయంలో అయినా  డేరింగ్ గా ఆమె ముందుకు సాగుతారు అని పేరు తెచ్చుకున్నారు. చిన్న వయసు కాబట్టి ఆమెకు చాన్స్ ఇస్తే దూకుడుగా పార్టీని ప్రభుత్వాన్ని తీసుకెళ్తారు అని ఒక అంచనా ఉంది.

ఇక ఈ ఇద్దరి మధ్యన మరో సీనియర్ ఎస్టీ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయనే పీడిక రాజన్న దొర. చిత్రమేంటంటే ఆయన పేరులో రాజున్నాడు, ఈసారి అయినా మంత్రి అయ్యే యోగం ఉందా అని అనుచరులు టెన్షన్ మీద ఉన్నారు. అయితే మహిళా కోటా, సమీకరణల వల్ల ఈసారి కూడా రాజన్నకు చాన్స్ దక్కే సీన్ లేదని అంటున్నారు.

అంటే స్థూలంగా చెప్పుకోవాలీ అంటే అయితే కళావతి, లేకపోతే భాగ్యలక్ష్మి. ఈ ఇద్దరిలోనే కొత్త గిరిజన మంత్రి వస్తారు అని అంటున్నారు. మరి ఎవరి ప్రయత్నాలలో వారు ఉన్నారు. పైగా జరుగుతున్న ప్రచారం కంటే కూడా  వచ్చే లిస్ట్ లో ఆసక్తికరమైన విషయాలు ఉంటాయని అంటున్నారు. అదే ఇపుడు అందరి ధీమాగా ఉంది.
Tags:    

Similar News